Begin typing your search above and press return to search.

'అల్లు'నే కొత్త 'మెగా' అంటూ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన ఆర్జీవీ..!

By:  Tupaki Desk   |   18 Jan 2022 2:44 PM GMT
అల్లునే కొత్త మెగా అంటూ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన ఆర్జీవీ..!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచుగా మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్స్ చేయడమే కాదు.. మెగా హీరోలను టార్గెట్ చేస్తూ సినిమాలు కూడా రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు ఒక్క ట్వీట్ తో ఫ్యాన్స్ మధ్యనే చిచ్చుపెట్టారు ఆర్జీవీ.

టాలీవుడ్ లో మెగా హీరోల స్టార్డమ్ గురించి రామ్ గోపాల్ వర్మ మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. ''ALLU అనేది కొత్త MEGA.. అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇది కాదనలేని వాస్తవం'' అని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది.

వర్మ ఏ ఉద్దేశంతో 'అల్లు నే కొత్త మెగా' అని ట్వీట్ చేశారో తెలియదు కానీ.. ఇదే ఇప్పుడు అభిమానుల్లో గందరగోళం సృష్టించింది. మెగా అభిమానులు రెండు వర్గాలుగా చెలిపోయి ట్విట్టర్ వార్ కు దిగేలా చేసింది. ఆర్జీవీ ట్వీట్ కు సపోర్ట్ గా బన్నీ ఫ్యాన్స్ నిలిస్తే.. మిగతా మెగా ఫ్యాన్స్ వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్నారు.

ఆర్జీవీ చెప్పింది వంద శాతం కరెక్ట్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మెగా బ్రాండ్ మెగాస్టార్ చిరంజీవి నుంచే వచ్చిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం మెగా హీరోలు మరియు అభిమానుల మధ్య గొడవలు పెట్టి ఎంజాయ్ చేయడానికే వివాదాస్పద దర్శకుడు ఇలాంటి ట్వీట్ చేసారని అభిప్రాయ పడుతున్నారు.

అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నీడ నుంచి బయటకు రావాలని చూస్తున్నట్లు గత కొన్నేళ్లుగా ఫిలిం సర్కిల్స్ లో ఊహాగానాలు ఉన్నాయి. తనని 'అల్లు' బ్రాండ్ తోనే ప్రమోట్ చేసుకునేలా బన్నీ వ్యవహారిస్తున్నట్టు చెప్పుకున్నారు. మెగా ఫ్యామిలీతో బంధం కొనసాగిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం బన్నీ కష్టపడుతున్నట్లు అప్పట్లేనే సోషల్ మీడియా కోడై కూసింది. అప్పుడప్పుడు ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ - అల్లు అభిమానులుగా విడిపోయి కొట్టుకోవడం అనేక సందర్భాల్లో చూశాం.

ఇప్పుడు 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అభిమానుల మధ్య వార్ కి మరోసారి ఆజ్యం పోసింది. ఎవరికి వారు 'మెగా' బ్రాండ్ గురించి పోటాపోటీగా ట్వీట్లు చేసుకోడానికి అవకాశం కల్పించిందని చెప్పవచ్చు. ఎవరి సపోర్ట్ తో ఎవరు ఇండస్ట్రీకి వచ్చారంటూ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునేలా చేసింది. మరి దీన్ని రాబోయే రోజుల్లో ఆర్జీవీ ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి.