జగన్ కి యాంటీగా వర్మ మూవీ... ?

Mon Jan 17 2022 13:51:09 GMT+0530 (India Standard Time)

RGV Movie On Ys Jagan

రామ్ గోపాల్ వర్మ. ఆయన పేరులోనే ఒక తమాషా ఉంది. మర్యాదపురుషోత్తముడు రాముడు ఉన్నాడు. అలాగే చిలిపి గోపాలుడూ ఉన్నాడు. ఇక వర్మ కూడా తన మూడ్ ని బట్టి తనకు నచ్చినట్లుగా ఉంటారు. ఆయన ఎవరినీ పట్టించుకోరు అమొ చెబుతారు. ఆయనది రామూయిజం. అదే ఆయనకు ఇష్టమైన ఇజం. మొత్తానికి ఎపుడూ వివాదాల్లో ఉండడమే వర్మ మార్క్ స్పెషాలిటీ.



అలాంటి వర్మ లేటెస్ట్ గా ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన మనసులో భావాలను విప్పి చెప్పారు. నిజానికి వర్మ తమ భావాలను ఎపుడూ ముసుగు వేసి దాచుకోలేదు. కాబట్టి ఆయన హార్ట్ ని ఓపెన్ చేసినా కొత్త విషయాలు అయితే ఉండవు అనుకోవాలి. ఒక వేళ ఉన్నా కూడా ఆయన ఎప్పటికపుడు ట్వీట్ల ద్వారా వాటిని బయటపెట్టేస్తారు కాబట్టి.

ఇదిలా ఉంటే జగన్ అంటే తనకు ఇష్టమని చెప్పుకునే వర్మ ఈ మధ్య ఉన్నట్లుండి వైసీపీ సర్కార్ మీద చిన్నపాటి యుద్ధమే చేశారు. అది కూడా సినిమా టికెట్ల పెంపు మీద ఆయన తనదైన శైలిలో పంచులు వేస్తూ ట్వీట్లు వేస్తూ వైసీపీ ప్రభుత్వ పెద్దలను బాగానే బయటకు లాగారు. ఆ మీదట మంత్రి పేర్ని నానితో వివాదం కాస్తా ముఖా ముఖీ చర్చల దాకా వెళ్ళింది. మొత్తానికి వర్మ మంత్రితో భేటీ అయి వచ్చాక కూడా తన ట్వీట్ల యుద్ధాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు.

ఈ నేపధ్యంలో వర్మ జగన్ ప్రభుత్వం మీద కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ప్రజలకు పాలన నచ్చలేదని వైసీపీ సర్కార్ రాజీనామా చేస్తుందా అని ఎవరూ అడగని ఒక ఘాటైన ప్రశ్నను వేసి నిలదీశారు. ఇంత చేసిన వర్మ వైసీపీకి యాంటీగా సినిమా తీస్తారా అన్న చర్చ కూడా వచ్చింది. కట్టప్పను చంపింది ఎవరు అంటూ ఆయన టికెట్ల రేట్ల పేంపు మీద చేసిన ట్వీట్లు కూడా సినిమాకు సరిపడే మూల వస్తువుగా అంతా భావించారు.

కానీ వర్మ ఆ విషయంలో ఏం చేస్తాడో ఎవరూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేకపోయారు. కానీ ప్రముఖ టీవీ చానల్ మాత్రం వర్మ మనసుని తట్టి అడగాల్సిన ఆ ప్రశ్నకు అడిగేసింది. మీరు అందరి మీద సినిమాలు తీస్తారు కదా జగన్ మీద ఎందుకు తీయరు అంటే దానికి వర్మ ఇచ్చిన ఆన్సర్ తీయాలా వద్దా అన్నది తన ఇష్టమని.

తనకు నచ్చితేనే సినిమా తీస్తాను అని అది ఎవరు ఏమిటీ అని ఆలోచించనని కూడా వర్మ చెప్పాడు. ఇక జగన్ మూడేళ్ల పాలనలో  రెండు విషయాలు ఉన్నాయి. వాటి మీద సబ్జెక్టులు తయారు చేసుకుని మూవీ తీయవచ్చు కదా అని ఆ మీడియా అడిగిన దానికి కూడా వర్మ నుంచి సరైన ఆన్సర్ రాలేదు. ఇంతకీ ఆ సబ్జెక్టులు ఏంటి అంటే ఒకటి మాజీ మంత్రి వివేకాందరెడ్డి హత్య కేసు. మరోటి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుని ఒక రాత్రి జైలులో పెట్టి హింసించారు అని జరిగిన ప్రచారం మీద.

అయితే వర్మకు మాత్రం జగన్ మీద సరైన సబ్జెక్ట్ ఇంకా రాలేదేమో. అందుకే నాకు నచ్చినపుడే తీస్తాను అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ అంటే తనకు ప్రత్యేకమైన ప్రేమ లేదని కూడా వర్మ అనడం. అయితే జగన్ ప్రజలలో కలసిపోయి ఒక మామూలు మనిషిగా ఉండడం మాత్రం తనకు నచ్చింది అని మనసులో మాట వర్మ చెప్పేశాడు. అంతే తప్ప జగన్ ఏంటో తనకు తెలియదు అని ఆయన పాలసీస్ విధానాలు ఆయన ఎలా పాలిస్తున్నారు అన్నది తనకు ఏమీ తెలియదు అని కూడా వర్మ చెప్పేశారు.

మొత్తానికి వర్మకు ఇప్పటికైతే జగన్ మీద యాంటీగా ఒక సినిమా చేయాలని అనిపించలేదు అనుకోవాలి. అయితే వర్మ ఇలాగే ఉంటారు అని ఎవరూ అనుకోరు కాబట్టి ఆయనకు జగన్ విషయంలో మంచి సబ్జెక్ట్ దొరికితే మాత్రం తప్పకుండా చేయకుండా ఉండరు. అది వైసీపీకి జగన్ కి యాంటీ అయినా కూడా ఆయన అసలు లెక్క చేయరని కూడా అందరికీ తెలుసు. ప్రస్తుతానికైతే వర్మ నుంచి ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ మీద సినిమా ఆశించినా కుదరదేమో.