చానల్ యాంకర్ పై RGV 'న్యూస్ వేశ్య' తీస్తాడట!

Mon Aug 03 2020 17:20:28 GMT+0530 (IST)

RGV 'News Prostitute' on Channel Anchor

యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం వెనక మిస్టరీ వీడలేదింకా. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధేశించినా ఇప్పటికీ మిస్టరీ ఏమిటో కనిపెట్టలేక పోలీసులు తలల పట్టుకుంటున్నారు. సుదీర్ఘ కాలం దర్యాప్తును సాగిస్తున్నారు. ఇక సుశాంత్ సింగ్ మరణంపై మీడియాలో రకరకాల డిబేట్లు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రముఖ వార్తా చానెల్ యాంకర్ ఆర్నాబ్ గోస్వామి బాలీవుడ్ ప్రముఖులపై వెలువరించిన కొన్ని అభిప్రాయాలు తాజాగా సంచలనం అయ్యాయి.రిపబ్లిక్ టీవీ చానెల్ లో డిబేట్లు పెట్టిన అర్నాబ్ బాలీవుడ్ గ్యాంగ్ స్టర్లు.. రేపిస్టులు.. సైకోల అరాచకాలు అంటూ చెలరేగారు. అయితే ఆయన డిబేట్ కి స్పందించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సడెన్ గా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడం కలకలం రేపింది. తొలినుంచి బాలీవుడ్ ఇన్ సైడర్స్ ఔట్ సైడర్స్ అనే టాపిక్ సరికాదని వారించిన ఆర్జీవీ యాంకర్ అర్నాబ్ వ్యాఖ్యల్ని ఖండించాడు.

వరుస ట్వీట్లలో అర్నాబ్ ని విమర్శించాడు ఆర్జీవీ. సల్మాన్.. షారుఖ్ వంటి పెద్ద తారలు.. బాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌసెస్ గురించి మాట్లాడటానికి మీడియాలో అర్నాబ్ వంటి వ్యక్తులను తీసుకోవాలని ఆర్జీవి డిమాండ్ చేశారు. ఇది సరిపోకపోతే.. అర్నాబ్ తనను తాను `న్యూస్ వేశ్య` అని పిలిపించుకుని సినిమా చేయాలని అన్నారు. అర్నాబ్ గోస్వామి బాలీవుడ్ గురించి ఇంత భయంకరమైన రీతిలో మాట్లాడటం చూసి షాక్ అయ్యానని.. అతను బాలీవుడ్ ని క్రిమినల్ కనెక్షన్ ఉన్న డర్టియెస్ట్ ఇండస్ట్రీ అని అన్నారని తెలిపారు. ఇది రేపిస్టులు.. గ్యాంగ్‌స్టర్లు.. లైంగిక దోపిడీదారులతో నిండి ఉన్న పరిశ్రమ అన్నారు అర్నాబ్ అని వెల్లడించారు.

ఇలాంటి ఆరోపణలు చేయడం తప్ప అర్నాబ్‌గోస్వామికి వేరే ఎజెండా లేదని నేను నమ్ముతున్నానని ఆర్జీవీ అన్నారు. దబాంగిష్ సల్మాన్ ఖాన్ లాగా రావడం.. సినీ పరిశ్రమ పెద్దలందరినీ కవర్ చేయడం కోసం కథనం నడిపించేలా చేయడం చేస్తాడు. అందుకే అతనిపై `మర్డర్ ట్రూత్` అంటూ సినిమా చేస్తాను అని ఆర్జీవీ అన్నారు.

అర్నాబ్ ని విస్తృతంగా అధ్యయనం చేసిన తరువాత ది న్యూస్ పింప్ లేదా ది న్యూస్ వేశ్య అనే సినిమా తీస్తానని అంటున్నా. మీరు నా చిత్రానికి ప్రతిస్పందిస్తారా లేదా అనేది నేను పట్టించుకోను. ఎందుకంటే నా టార్గెట్ ప్రేక్షకులు మీరే అవుతారు. కానీ అది మీ ప్రేక్షకులకు చేరువ అవుతుంది. నా పద్ధతిలో నేను అందరినీ కదిలించాలనుకుంటున్నాను అనీ ఆర్జీవీ కౌంటర్ వేశారు.

వివాదాస్పద వ్యక్తులపై ఆర్‌జివి సినిమాలు తీయడంలో కొత్తేమీ కాదు. కానీ అర్నాబ్ గోస్వామిపై తీయాలని అనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్లపై ఆయన స్పందిస్తారా లేదా? అన్నది చూడాలి.