Begin typing your search above and press return to search.

'పుష్ప: ది రూల్' మ్యూజిక్ పై లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   20 Jan 2022 12:30 AM GMT
పుష్ప: ది రూల్ మ్యూజిక్ పై లేటెస్ట్ అప్డేట్..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప: రైజ్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు నమోదు చేయగలిగింది. ఈ సినిమా విజయంలో బన్నీ తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు కూడా భాగం ఉంది.

'పుష్ప' పార్ట్-1 కోసం దేవిశ్రీ స్వరపరిచిన అన్ని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'దాక్కో దాక్కో మేక' 'శ్రీవల్లి' 'ఊ అంటావా మావా' 'సామీ సామీ' 'హే బిడ్డా' వంటి ఐదు సాంగ్స్ మిలియన్ల కొలదీ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేశాయి. మొదటి భాగం సక్సెస్ అవడంతో ఇప్పుడు 'పుష్ప: ది రూల్' మ్యూజిక్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ నేపథ్యంలో 'పుష్ప 2' పాటలకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అదేంటంటే సెకండ్ పార్ట్ కోసం దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 'పుష్ప: ది రూల్' కోసం ఇప్పటికే బేసిక్ ట్యూన్స్ ని సెట్ చేసిన డీఎస్పీ.. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో సాంగ్స్ మీద ఫోకస్ పెట్టనున్నారు.

అలానే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చార్ట్ బస్టర్‌ గా నిలవడంతో, రెండో భాగంలోనూ ఓ స్పెషల్ నంబర్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు ఈ ప్రత్యేక గీతం కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని సంప్రదిస్తున్నట్లు టాక్. పార్ట్-1 కోసం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభును తీసుకొచ్చిన మేకర్స్.. ఇప్పుడు ఎవరిని ఐటమ్ భామగా మారుస్తారో.

ఇకపోతే 'పుష్ప: ది రైజ్' సినిమాలోని పాటలకు మంచి స్పందన వచ్చినప్పటికీ.. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. పార్ట్-2 బీజీఎం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి డీఎస్పీ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి.

కాగా, కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ అనే యువకుడు.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' చిత్రంలో చూపించారు. రెండో భాగం 'పుష్ప: ది రూల్' లోనే మెయిన్ కథంతా ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కోవిడ్ నేపథ్యంలో కాస్త లేట్ గా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.