Begin typing your search above and press return to search.

లాక్ డౌన్లో బాలయ్యను లాక్ చేద్దామని..

By:  Tupaki Desk   |   3 April 2020 12:30 AM GMT
లాక్ డౌన్లో బాలయ్యను లాక్ చేద్దామని..
X
టాలీవుడ్లో అత్యంత వేగంగా స్క్రిప్టు రాసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటాడు. ఈ డాషింగ్ డైరెక్టర్ రెండు వారాల్లో బౌండ్ స్క్రిప్టు రెడీ చేయగల సమర్థుడు. పూరి తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా వాటికి స్క్రిప్టు చాలా వేగంగా రెడీ అయింది. సినిమాకు సినిమాకు ఏమంత గ్యాప్ తీసుకోకుండా చాలా తక్కువ సమయంలో స్క్రిప్టు పని అవగొట్టేస్తుంటాడు పూరి. ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే కరోనా వైరస్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోవడం తో పూరి ఖాళీ అయిపోయాడు. ముందుగా ఈ ఖాళీ సమయంలో జనాల్లో అవగాహన పెంచే దిశగా ఒకట్రెండు వీడియో సందేశాలు ఇచ్చిన పూరి.. ఇప్పుడు తిరిగి సినిమా పనిలోనే పడిపోయాడు.

తాను ఈ లాక్ డౌన్ సమయంలో ఓ స్టార్ హీరో కోసం కథ రెడీ చేస్తున్నట్లు తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి చెప్పుకొచ్చాడు. దీంతో ఎవరా స్టార్ హీరో అన్న చర్చ మొదలైంది. 'ఇస్మార్ట్ శంకర్' హిట్టయి విజయ్ దేవరకొండ పూరి తో సినిమాకు ఒప్పుకున్నాడు కానీ.. అదేదో ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయం తో ఉన్న టాలీవుడ్ స్టార్లు చాలామంది ఆయనతో సినిమా చేయడానికి ఏమంత ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఐతే పూరి ట్రాక్ రికార్డు చూడకుండా 'పైసా వసూల్' చేసిన బాలయ్య.. ఆ సినిమా ఆడకున్నా మళ్లీ పూరి తో ఇంకో మూవీ చేయడానికి ఆసక్తి చూపించాడు. అనివార్య కారణాల వల్ల ఈ కాంబినేషన్ రిపీటవ్వలేదు. ఇప్పుడు బాలయ్య కోసమే పూరి మళ్లీ కథ రాస్తున్నాడని.. ఇంకొన్ని రోజుల్లో కథ సిద్ధం చేసి బాలయ్యను కలిసి నరేషన్ ఇవ్వబోతున్నాడని సమాచారం.