పూరీ కి మహేష్ మీద ఇంకా కోపం తగ్గలేదా..?

Thu Aug 11 2022 13:15:55 GMT+0530 (IST)

Puri Maintains Pin Drop Silence On Pokiri Special Show

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లేనప్పటికీ.. ఏమాత్రం నిరాశ చెందకుండా 'పోకిరి' మూవీ స్పెషల్ షోలతో సందడి చేశారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ లోనూ 'పోకిరి' స్పెషల్ షోలను ప్రదర్శించారు. రికార్డు స్థాయిలో దాదాపు 400 షోలు నిర్వహించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకూ ఇన్ని షోలను వేయలేదనే చెప్పాలి. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

'పోకిరి' చుట్టూ ఇంత హంగామా జరుగుతున్నా దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమా స్పెషల్ షోల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం.. కనీసం ఓ ట్వీట్ కూడా చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో మహేష్ తో ఉన్న విభేదాలను పూరీ మర్చిపోలేదని.. అందుకే ఇంత ఈ వేడుకలను పట్టించుకోలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించాయి. 'పోకిరి' సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోని రికార్డులను తిరగరాయగా.. 'బిజినెస్ మ్యాన్' మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే దశాబ్దం గడిచినా వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాలేదు. నిజానికి మహేష్ - పూరీ కలిసి 'జనగణమన' అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఇరు వర్గాలూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అంతేకాదు దర్శక హీరోల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

అయినప్పటికీ ఈ కాంబోలో సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మహేష్ హిట్స్ లో ఉంటేనే డేట్స్ ఇస్తాడంటూ ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ కామెంట్స్ చేయడంతో.. అభిమానులు కూడా వీరి కాంబోపై ఆశలు వదులుకున్నారు.

మహేశ్ బాబు మాత్రం ఏమీ మనసులో పెట్టుకోకుండా పూరీ పుట్టినరోజుకు విషెస్ చెప్పడమే కాదు.. పూరీ తన అభిమాన దర్శకులలో ఒకరని.. ఎప్పుడు తన వద్దకు వచ్చి కథ చెబుతాడా అని ఎదురు చూస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టాడు. కానీ పూరీ మాత్రం ఇప్పుడు సూపర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగం కాలేదని మహేశ్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇటీవల ఐమాక్స్ లో మహేష్ బాబు అభిమానులు 'ఒక్కడు' సినిమా స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్ గుణశేఖర్ హాజరవడమే కాదు.. థియేటర్ లో కేక్ కటింగ్ చేసి ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ 'పోకిరి' స్పెషల్ షోల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

'పోకిరి' సినిమా పూరీ జగన్నాధ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. దీనికి ఆయన ప్రొడ్యూసర్ కూడా. అందుకే స్పెషల్ షోలలో ఏదొక విధంగా భాగం కావాల్సిందని అంటున్నారు. అందులోనూ త్వరలో 'లైగర్' సినిమా రిలీజ్ కూడా ఉంది కాబట్టి.. ఇది పరోక్షంగా ఆ మూవీ ప్రమోషన్స్ కు సహాయపడేదని అభిప్రాయ పడుతున్నారు.

అయితే మహేష్ టీమ్ మాత్రం పూరీ కి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. దీనిపై కొందరు ఫ్యాన్స్ నెగెటివ్ గా కామెంట్స్ చేశారు. ఆయన రెస్పాన్డ్ అవ్వకపోయినా.. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కాబట్టి థాంక్స్ చెప్పారని మరికొందరు అంటున్నారు.

వాస్తవానికి పూరీ జగన్నాథ్ చాలా కాలంగా సోషల్ శంక మీడియాకు దూరంగా ఉంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'లైగర్' సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఒకవేళ దర్శకుడు ట్విట్టర్ లో ఉండుంటే 'పోకిరి' ప్రీమియర్ షోల గురించి పోస్ట్ పెట్టి ఉండేవాడేమో!