Begin typing your search above and press return to search.

పూరి మెల్ల మెల్ల‌గా లాగుతున్నాడే!

By:  Tupaki Desk   |   10 Sep 2019 6:48 AM GMT
పూరి మెల్ల మెల్ల‌గా లాగుతున్నాడే!
X
``మెల్ల‌గా ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదు. ముంబాయిని ఉ* పోయించ‌డానికి వ‌చ్చాను!`` `బిజినెస్ మేన్` చిత్రంలో బ్ర‌హ్మాజీకి దిమ్మ తిరిగిపోయేలా మ‌హేష్ చెప్పే డైలాగ్ ఇది. స్టార్ డైరెక్ట‌ర్ పూరి క‌లం ప‌దును ఎంతో ఈ ఒక్క డైలాగ్ చెబుతుంది. ఆయ‌న మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా ఈ డైలాగ్ రివీల్ చేసింది. ఇంత‌కీ పూరి హైద‌రాబాద్ కి ఎందుకొచ్చారు? వ‌చ్చిన ప‌ని పూర్త‌యిందా లేదా? అంటే.. ఆయ‌న లైఫ్ జ‌ర్నీ గురించి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్నేహితులు అనుకున్న వాళ్లు మోసం చేశాక ఉన్న‌వ‌న్నీ కోల్పోయి ఎలాగోలా తిరిగి సినిమాల‌తోనే బతుకు జీవుడా అంటూ బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న‌కు తెలిసింది సినిమా తీయ‌డం ఒక్క‌టే. అదే తిరిగి జీరో నుంచి హీరోని చేసింద‌ని చెబుతుంటారు. అయినా ఆయ‌న హైద‌రాబాద్ కి మెల్ల‌గా ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదన్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలంద‌రినీ డైరెక్ట్ చేసిన పూరి మ‌హేష్ తో పోకిరి- బిజినెస్ మేన్ లాంటి క్రేజీ సినిమాల్ని తీశారు. కానీ ఆ త‌ర్వాత నుంచి మ‌హేష్ తో ఎందుక‌నో పూరికి చెడింది. తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌హేష్ కి క‌థ చెబితే నో చెప్పారట‌. దాంతో హ‌ర్ట‌యిన పూరి ఇటీవ‌ల ఓ వేదిక‌పై బ‌హిరంగంగానే వాపోతూ మ‌హేష్ స‌క్సెస్ డైరెక్ట‌ర్ల వెంట ప‌డ‌తాడ‌ని అనేయ‌డం వైర‌ల్ అయ్యింది.

గ‌తం గ‌తః అనుకుంటే వ‌ర్త‌మానం ఏమిటి? అంటే పూరి ప్ర‌స్తుతం రివ‌ర్సులో స‌క్సెస్ ఉన్న‌ హీరోల‌ వెంట ప‌డుతున్నాడు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్పీడ్ మీద ఉన్న దేవ‌రకొండ‌ను అత‌డు ఖాతాలో వేసుకున్నాడు. డియ‌ర్ కామ్రేడ్ ఫ్లాప్ అవ్వ‌డం కూడా పూరికి క‌లిసొచ్చింద‌న్న చ‌ర్చా ఇటీవ‌ల మీడియాలో వేడెక్కించింది. దేవ‌ర‌కొండతో ఫైట‌ర్ (వ‌ర్కింగ్ టైటిల్)కి ప్లాన్ చేశాడు. ఆ త‌ర్వాత పూరి స్కెచ్ ఏమిటి? అంటే దానికి కూడా తాజాగా ఓ స‌మాధానం ల‌భించింది.

ఇప్ప‌టికే డార్లింగ్ ప్ర‌భాస్ కి పూరి ఓ క‌థ వినిపించారు. అది మ‌హేష్ తో చేయాల‌నుకున్న జ‌న‌గ‌న‌మ‌న స్క్రిప్టు అని తెలిసింది. పూరి వినిపించిన క‌థ డార్లింగ్ కి న‌చ్చింది. ఆ క్ర‌మంలోనే పూరి ప్ర‌భాస్ ని అస్స‌లు విడిచిపెట్ట‌డం లేదట‌. గ‌త రెండ్రోజులుగా హైద‌రాబాద్ లో ఉన్న డార్లింగ్ ని మెల్లిగా లైన్ లో పెడుతున్నాడట‌. మెల్లిగా ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదు కాబట్టి పూరి ప్లాన్ కూడా ఆ రేంజులోనే ఉంటుంది మ‌రి. బాహుబ‌లి 1.. బాహుబ‌లి2 త‌ర్వాత సాహో చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ పేరు మార్మోగింది. ఒక‌వేళ ప్ర‌భాస్ క్రేజును ఉప‌యోగించి పాన్ ఇండియా లెవ‌ల్లో పూరి ఏదైనా సాధించాలని అనుకుంటున్నాడా? అన్న సందేహం క‌లుగుతోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే ... అస‌లు క‌మ‌ర్షియ‌ల్ సినిమా హంగామా ఏంటో మాసిజం అంటే ఏమిటో ఇరుగు పొరుగు ఇండ‌స్ట్రీస్ కి మ‌రోమారు రుచి చూపిస్తాడ‌నే దీన‌ర్థం. పూరి తెర‌కెక్కించిన పోకిరి దాదాపు అన్ని ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు.. అటు బాలీవుడ్ లోనూ వాంటెడ్ పేరుతో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఊపు మ‌ళ్లీ తెస్తాడా డార్లింగ్ ఓకే చెబితే అన్న‌ది చూడాలి. అన్న‌ట్టు అప్ప‌ట్లో ఇదే జ‌న‌గ‌న‌మ‌న క‌థ‌ని రాకింగ్ స్టార్ య‌శ్ కి వినిపించాడ‌ని ప్ర‌చార‌మైంది. కానీ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేదో ఏమో.. మ‌ళ్లీ ప్ర‌భాస్ ని క‌లిశాడ‌ట మ‌రోసారి. డార్లింగ్ ని మ‌న‌ బుజ్జిగాడిని ఏదోలా మెల్ల మెల్ల‌గా రింగులోకి లాగుతున్నాడా ఏం?