ఆ దేవుడు పంపించేది కూడా పోలీసోడినే: పూరి

Fri Dec 06 2019 18:28:51 GMT+0530 (IST)

Puri Jagannath Comments on About Telangana Police

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం.. హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. "క్రిమినల్స్ కు.. తీవ్రవాదులకు.. సైకోలకు.. పర్వర్టులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయి.. బాధితులకు బాధితుల కుటుంబ సభ్యులకు అసలు హక్కులేమీ ఉండవు" అనేరకంగా వితండవాదంతో మేథావుల ముసుగు వేసుకుని లెక్చర్లు దంచే కొందరు తప్ప మిగతా సభ్య సమాజం అంతా ఈ ఎన్ కౌంటర్ విషయంపై చా.....లా సంతోషంగా ఉంది.  సాధారణ ప్రజలు ఈ ఎన్ కౌంటర్ ను పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అత్యాచార ఘటనల పట్ల సాధారణ ప్రజల్లో ఎంత కోపం ఉందో మనకు తెలుస్తుంది. చాలామంది అమ్మాయిలు 'నిర్భయ ఘటనలో నిందితులను కూడా ఇలానే చేయాలని' ఢిల్లీ పోలీసులను కోరుతున్నారు.  ఇక సెలబ్రిటీలు కూడా దిశ కేసులో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో హైదరాబాద్ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ "సెల్యూట్. తెలంగాణా పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను.  మీరు నిజమైన హీరోలు. నేనెప్పటికీ ఒక విషయం నమ్ముతాను. అదేంటంటే మనకి కష్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు.  నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే @తెలంగాణా DGP @KTRTRS" అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో పూరి జగన్నాధ్ పోలీస్ కమీషనర్ వీసి సజ్జనార్ ఫోటోను రీట్వీట్ చేస్తూ "సెల్యూట్" చేశారు.  పూరి జగన్నాధ్ ట్వీట్లకు వేల సంఖ్యలో లైక్స్ కొట్టి నెటిజన్లు తమ మద్దతు తెలపడం విశేషం.