పవన్ కళ్యాణ్ కి సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చిన ఫిలిం ఛాంబర్.. ఇప్పుడెందుకు గుర్తురాలేదు..?

Fri May 29 2020 22:30:09 GMT+0530 (IST)

When Pawan Kalyan had a problem film chamber reacted..

టాలీవుడ్ సినీ ప్రముఖుల మీటింగ్ పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మీటింగ్ కు తనను పిలవలేదని.. ఆ విషయం గురించి తనకు తెలియదని మీడియాలో చూసి తెలుసుకున్నానని బాలయ్య అన్నారు. ఆ తరవాత ప్రభుత్వంతో ఏం చర్చలు జరుగుతున్నాయో తనకు తెలీదని.. అసలు ఆ చర్చలకు తనను ఎవరు పిలిచారని.. తలసానితో కలిసి హైద్రాబాదులో భూములు పంచుకుంటున్నారా.. అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసారు. బాలయ్య ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరని.. నోరు అదుపులో పెట్టుకోవాలని.. మీరు కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలపై ఇండస్ట్రీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత ప్రసన్న కుమార్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ ఓ ప్రైవేట్ హౌస్ లో జరిగిన ప్రైవేట్ మీటింగ్ అని.. వాళ్ళకి ఇష్టమైన సభ్యులతో మాత్రమే జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా బాలయ్యని పిలవకపోవడంపై స్పందిస్తూ ''బాలయ్య ఒక స్టార్ హీరో.. ఒక ప్రొడ్యూసర్.. ఒక ఎక్జిబిటర్.. ఒక డిస్ట్రిబ్యూటర్.. ఒక టెక్నీషియన్.. మొత్తంగా ఆయన ఒక వ్యవస్థ. అలాంటి వ్యక్తికి ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ కి పిలుపురాకపోవడం చాలా బాధాకరమని'' అన్నారు. మద్రాస్ నుండి ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రావడంలో చిరంజీవి అప్పట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపారని.. అలాంటిది ఇప్పుడు రాళ్ళూ రప్పలు ఉన్న చోట అద్భుతమైన స్టూడియోలు నిర్మించిన కొందరిని పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్టని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిపే అధికారిక మీటింగ్ ఒక ప్రైవేట్ హౌస్ లో జరపాల్సిన అవసరం ఏంమొచ్చిందని.. దీని వల్లే ఇంత వివాదం చెలరేగుతోందని అన్నారు.

అంతేకాకుండా ఇన్ని ఏళ్ళ నుండి అధికారికంగా ఏమి చేసిన ఫిలిం ఛాంబర్ నుండే చేస్తూ వస్తున్నాం.. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి సమస్య వస్తే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్.. ఇలా మొత్తం వచ్చి ఫిలిం ఛాంబర్ ముందు కూర్చున్నారు. ఆ రోజు ఛాంబర్ ప్రాముఖ్యత తెలిసిన మీకు ఇప్పుడు మాత్రం చాంబర్ ఎందుకు గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు. బాలయ్యతో పాటు ఎంతో మంది సీనియర్స్ ని అవమానిస్తూ ప్రైవేట్ మీటింగ్ ఎందుకు పెట్టారని ఆయన అన్నారు. ఇంకా నాగబాబు 'బాలయ్య కింగేమీ కాదు.. జస్ట్ హీరో మాత్రమే' అని అనడంపై మాట్లాడుతూ 'బాలయ్య కింగే' అని నిర్మాత ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చారు.