Begin typing your search above and press return to search.

స్పెర్మ్ డొనేషన్ అనే పాయింట్ ని ఫన్నీగా చెప్పాం..!

By:  Tupaki Desk   |   1 Oct 2022 10:56 AM GMT
స్పెర్మ్ డొనేషన్ అనే పాయింట్ ని ఫన్నీగా చెప్పాం..!
X
బెల్లంకొండ గణేష్ - వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''స్వాతిముత్యం''. లక్ష్మణ్ కె కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సహకారంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై ఎస్. నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మాత నాగవంశీ మీడియాతో ముచ్చటించారు.

* 'స్వాతిముత్య' ఎలా ఉండబోతోంది..?
- ఇది దసరా కి వచ్చేఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా థియేటర్ నుంచి నవ్వుకుని బయటకు వస్తారు. మేం అద్భుతం తీసాం.. ఆణిముత్యం లాంటి సినిమా చేసాం.. అవార్డ్స్ వస్తాయి అని చెప్పను కానీ.. పండుగ రోజు సినిమాకి వస్తే గ్యారెంటీగా నవ్వుకుని వెళ్లారు. ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని స్పెర్మ్ డొనేషన్ అనే ఓ పాయింట్ ని వినోదాత్మకంగా చెప్పాం. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ని ఫన్నీగా చెబుతున్నాం.

* స్పెర్మ్ డొనేషన్ పాయింట్ ను ఎంచుకోడానికి కారణం..?
- స్పెర్మ్ డొనేషన్ మీద గతంలో 'విక్కీ డోనార్' రీమేక్ గా సుమంత్ గారు సినిమా చేశారు. దానికి ఆశించిన రిజల్ట్ రాలేదు.. పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకొని.. అది కూడా సొసైటీకి హెల్ప్ ఫుల్ అవుతుంది అనేది ఫన్ టోన్ లో చెప్పాం.

* కొత్త డైరెక్టర్ కి మీరేమైనా సూచనలు చేశారా?
- ఈరోజుల్లో వచ్చే కొత్త దర్శకులు ఎవరూ పానిక్ అవడం లేదు. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తను నమ్మింది చాలా కాన్ఫిడెంట్ గా తీసాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం.

* గాడ్ ఫాదర్ - ఘోస్ట్ సినిమాలతో పాటుగా విడుదల చేస్తున్నారు. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
- కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటిదేం లేదండి. నేను మొన్న కూడా చెప్పాను. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.

* చిరంజీవి గారు మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు కదా.. మీరెలా ఫీల్ అయ్యారు?
- అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.

* ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి? టైటిల్ పెట్టేముందు బాగా ఆలోచించారా?
- హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి 'స్వాతిముత్యం' టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.

* స్వాతిముత్యం అంటే అమాయకుడా? పిచ్చోడా?
- పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా ఉంటాడు.

* కొంతకాలంగా ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలనే ఆదరిస్తున్నారు? మీ చిత్రం ఆదరణ పొందుతుంది అనుకుంటున్నారా?
- బింబిసార - సీతారామం - కార్తికేయ -2.. వేటికవే విభిన్న చిత్రాలు. అన్నీ ఆదరణ పొందాయి. అలాగే ఇటీవల ఎంటర్టైన్మెంట్ సినిమాలు పెద్దగా రాలేదు. 'డీజే టిల్లు' తర్వాత ఇదే అనుకుంటున్నా. అలా అని కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. కొత్త కాన్సెప్ట్ కూడా ఉంటుంది.

* వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?
- 'మిడిల్ క్లాస్ మెలోడీస్' లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని ఎంపిక చేయడం జరిగింది.

* ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?
- బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.

* 'స్వాతిముత్యం' నుంచి ఇక సితారలో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?
- 'డీజే టిల్లు' నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు - వరుడు కావలెను - స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు - రవితేజ గారు - వైష్ణవ్ తేజ్ - నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారు బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.

* చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?
- నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఆయనతో త్వరగా సినిమా చేయాలని.

* మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్తారా?
- త్రివిక్రమ్ - మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' 'ఖలేజా' సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసారు. ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది. మహేష్ గారిని ఇంతముందు చూడని క్యారక్టర్ లో చూస్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.