ఇండస్ట్రీకి భజన వెబ్ సైట్ రాబోతోందా ?

Sat Aug 10 2019 12:20:07 GMT+0530 (IST)

Producer Guild to Launch A Website

ఏమో టాలీవుడ్ నిర్మాతల ఆలోచన తీరు చూస్తే ఇదే అనిపిస్తోంది. త్వరలో తామంతా కలిసి ప్రొడ్యూసర్స్ గిల్ట్ తరఫున ఒక వెబ్ సైట్ లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు వాళ్ళు చెప్పడం చూస్తే త్వరలో కొత్త పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివన్నీ ముందు వీటిలోనే ఉంచి ఆ తర్వాత మిగిలిన వెబ్ సైట్స్ కు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తారట.అంతే కాదు కొందరి రివ్యూల వల్ల ఓపెనింగ్స్ తో పాటు ఓవర్సీస్ కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతుండటాన్నీ సీరియస్ గా తీసుకున్నారని ఇదే చర్చలో ఎక్కువ సేపు డిస్కస్ చేశారని వినికిడి. ఇదంతా బాగానే ఉంది కాని ఇలా నిర్మాతల స్వంత వెబ్ సైట్ అంటే ఎలాంటి సినిమా అయినా భజన తప్ప ఇంకేమి ఆశించడానికి ఉండదు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అధికారికంగా కాకపోయినా వెనుక నుండి ప్రోత్సహిస్తూ కొందరు నిర్మాతలు నడిపించారు కాని అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

ఇక్కడో వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఆన్ లైన్ మీడియాను ఫాలో అయ్యే చదువరులు అమాయకులు కారు. ఏది నిజమో ఏది మసిపూసిన మారేడుకాయో ఈజీగా పసిగట్టగలరు. ఒకటి రెండు సార్లు ఏమార్చి నమ్మించవచ్చేమో కాని అన్నిసార్లు మభ్యపెట్టడం అసాధ్యం. ఎవరైతే వాస్తవాలను చెబుతున్నారో వాళ్లనే నమ్ముతారు తప్ప నిర్మాతల సైట్ అన్నంత మాత్రాన ఎగజైట్ అయిపోరు.

అందులోనూ సైట్ అయితే ఓపెన్ చేయవచ్చు కాని ఫేస్ బుక్ యుట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ మీద ఆధారపడకుండా ప్రమోషన్ చేసుకోవడం అసాధ్యం. అవి పబ్లిక్ డొమైన్స్ కాబట్టి అందరూ వాడుకుంటారు. అలాంటప్పుడు ఏదైనా మా సైట్ ద్వారానే వెళ్ళాలనే నిర్మాతల ఆలోచన నిజంగా వర్క్ అవుట్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇదైనా విజయవంతం కావాలని పరిశ్రమ మీడియా వర్గాలతో పాటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు