Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' విషయంలో దిల్ రాజు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

By:  Tupaki Desk   |   24 May 2022 5:30 PM GMT
ఎఫ్ 3 విషయంలో దిల్ రాజు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
X
కరోనా పాండమిక్ టైంలో సినీ అభిమానులు చాలా వరకు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు అంతా నార్మల్ అయి సినిమాలు రిలీజ్ అవుతున్నా.. డిజిటల్ వేదికలకు అలవాటు పడిన ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అలానే కోవిడ్ తర్వాత సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెంచేయడంతో ఫ్యామిలీ జనాలు సినిమా హాళ్లకు దూరమవుతున్నారు. రిపీట్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈ విషయాలను గమనించిన అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ''ఎఫ్ 3'' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ప్లాన్ వేసుకున్నారు.

వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఎఫ్ 3'. 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మే 27న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇటీవల కాలంలో అధిక టికెట్ రేట్ల వల్ల ఓ వర్గం ఆడియన్స్ థియేటర్ల వైపు చూడటం లేదని గ్రహించిన మేకర్స్.. సాధారణ టికెట్ ధరలతో ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పాండమిక్ తర్వాత థియేటర్లకు రావ‌డం త‌గ్గించేసిన వారిలో ఎక్కువ శాతం కుటుంబ మహిళా ప్రేక్షకులే ఉన్నారు. పెంచేసిన రేట్లతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే జేబులకు చిల్లులు పడటం ఖాయం. అందుకే వాళ్లంతా అవే డబ్బులతో రెండు మూడు ఓటీటీల సబ్ స్క్రిప్షన్స్ తీసుకొని అందరం ఇంట్లోనే కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చనే ధోరణిలో ఉన్నారు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాధారణ స్థాయిలో రేట్లు పెట్టాలని 'ఎఫ్ 3' మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసిన సినిమా కావడంతో.. ఇప్పుడు వాళ్ళందరినీ థియేటర్లకు రప్పించాలని చూస్తున్నారు. అందులోనూ గత రెండేళ్లలో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ ను పూర్తి స్థాయిలో అలరించిన సినిమాలు రాలేదనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో 'ఎఫ్ 3' చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. దీనికి తగ్గట్టుగానే 2 గంటల 28 నిమిషాల నిడివితో సెన్సార్ బోర్డ్ క్లీన్ 'యూ' సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో కనీసం స్మోకింగ్ సీక్వెన్స్‌ లేనందున ముఖేష్ స్మోకింగ్ యాడ్స్ కూడా తప్పనిసరి కాదు.

'ఎఫ్ 2' సినిమా ప్రాంఛైజీలో వస్తుంది కాబట్టి.. నవ్వులు గ్యారంటీ అని భావించవచ్చు. ఇవన్నీ చూసుకుంటే 'ఎఫ్ 3' సినిమా కుటుంబ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది. మంచి టాక్ వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.