Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ట్రెండ్‌.. మళ్లీ ముస్తఫా ముస్తఫా 

By:  Tupaki Desk   |   7 Dec 2022 12:30 AM GMT
రీ రిలీజ్ ట్రెండ్‌.. మళ్లీ ముస్తఫా ముస్తఫా 
X
స్టార్‌ హీరోల పుట్టిన రోజులకు లేదంటే ఏదైనా ప్రత్యేక రోజుల్లో సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ సినిమాలను రీ రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. ఆయా హీరోల అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేస్తూ రీ రిలీజ్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ను నమోదు చేస్తున్నారు.

మహేష్‌ బాబు.. పవన్‌ కళ్యాణ్‌.. చిరంజీవి.. బాలకృష్ణ.. ప్రభాస్ ఇలా ఎంతో మంది స్టార్‌ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పెద్దగా స్టార్‌ కాస్ట్‌ లేని సూపర్ హిట్‌ క్లాసిక్‌ మూవీ రీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. 1990 ల్లో యూత్‌ ఆడియన్స్ ను పిచ్చెక్కించిన సినిమా ప్రేమదేశం సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు.. కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్‌. టబు, వినీత్‌, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా యూత్‌ ఆడియన్స్ కి నచ్చే విధంగా తీయడం జరిగింది.

ప్రేమదేశం పాటలు ఇంకా కూడా మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ముస్తఫా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక భూమిక పోషించింది.

ఈ క్లాసిక్‌ ప్రేమదేశం మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. డిసెంబర్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కాబోతోంది. ప్రేమదేశం సినిమా స్పెషల్ షో హైదరాబాద్ లో వేయబోతున్నారు.

ఈ సినిమా ఇప్పటి యువతకు కూడా కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మరి రీ రిలీజ్ లోనే ముస్తఫా మ్యాజిక్ రిపీట్‌ అయ్యేనా చూడాలి.