Begin typing your search above and press return to search.

'మేజర్'లో ప్రమోద పాత్ర కల్పితం కాదు: అడివి శేష్

By:  Tupaki Desk   |   29 May 2022 3:30 AM GMT
మేజర్లో ప్రమోద పాత్ర కల్పితం కాదు: అడివి శేష్
X
అడివి శేష్ హీరోగా 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితచరిత్రను 'మేజర్' టైటిల్ తో రూపొందించారు. కొంత కాలం క్రితం, ముంబైలోని ఒక హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో అడివి శేష్ భార్య పాత్రలో సైయీ మంజ్రేకర్ నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్ .. రేవతి పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవే. అయితే ఆ హోటల్లో తీవ్రవాదుల చేతిలో బందీగా ఉన్న 'ప్రమోద' పాత్రను శోభిత ధూళిపాళ పోషించింది.

ఈ సినిమాను జూన్ 3వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. శోభిత పోషించిన 'ప్రమోద' పాత్ర నిజంగానే ఉందా? కల్పితమా? అనే ప్రశ్న అడివి శేష్ కి ఎదురైంది.

అందుకు అడివి శేష్ మాట్లాడుతూ .." ఈ సినిమాలో శోభిత చేసిన పాత్ర కల్పితం కాదు .. నిజమైనదే. హోటల్ లోపలే ఉంటూ తీవ్రవాదుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన పాత్ర అది. బయట ఆమెను కలుసుకుని, ఆమె బందీగా ఉన్నప్పటి విషయాలను పూర్తిగా తెలుసుకోవడం జరిగింది.

సందీప్ ఉన్నికృష్ణన్ గురించి నేను చాలాకాలం క్రితమే విని ఉన్నాను. ఆయన ధైర్యసాహసాలు .. త్యాగాలను గురించి విన్నాను. ఆయన అభిమానిగా కూడా మారిపోయాను.

అలాంటి ఆయన జీవితచరిత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హోటల్ తాజ్ లో జరిగిన సంఘటనలో భాగం కావడమే కాదు .. అంతకుముందు ఆయన ఎలా బ్రతికారు .. ఆయన బాల్యం .. టీనేజ్ లోకి అడుగుపెట్టడం .. ప్రేమలో పడటం .. పెళ్లి చేసుకోవడం .. ఆ తరువాత ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి.

ఈ సినిమాలో మొదటి 40 నిమిషాల కథలో ఆయన ఎంత సింపుల్ గా కనిపిస్తారో .. ఆ తరువాత అంత సిన్సియర్ గా అనిపిస్తారు. ఆయన గురించిన ప్రత్యేకతలను గురించి తెలుసుకుంటూ వెళుతున్నా కొద్దీ, ఆయన పాత్రను తప్పకుండా పోషించాలనే నిర్ణయం మరింత బలపడుతూ వచ్చింది. ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ చెప్పలేం .. చూపించలేం. అందువలన తగ్గించుకుంటూ ఈ సినిమా చేయవలసి వచ్చింది. ప్ర్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.