ప్రభుదేవా ప్రయోగాత్మక సినిమా `భగీరా` తొలి టీజర్ నుంచి క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా ప్రభుదేవా కెరీర్ లోనే ఒక భారీ ప్రయోగం. ఇందులో అతడు ఎవరూ ఊహించని విభిన్న రూపాల్లో దర్శనమిచ్చాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఇది రూపొందింది.
నిజానికి ఈ చిత్రం చాలా రోజులుగా నిర్మాణంలో ఉంది. చాన్నాళ్లుగా ఆలస్యమైన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది.
తాజా సమాచారం మేరకు `భగీరా` మార్చి 31(నేటి) నుండి OTTలో ప్రసారం కానుంది. భగీరా చిత్రం సగటు సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.
అయితే మేకర్స్ OTTలో మంచి ఆదరణ దక్కించుకుంటుందని భావిస్తున్నారు. భగీరాలో ప్రభుదేవా సైకో కిల్లర్ గా కనిపించాడు. థ్రిల్లర్ డ్రామా కోసం అతడు విభిన్న రూపాలను ప్రదర్శించాడు. కొరియోగ్రాఫర్ గా-దర్శకుడిగా-నటుడిగా ప్రభుదేవా చాలా విభిన్నంగా ప్రయత్నించాడు. ఇందులో మొట్టమొదటి సారి బట్టతల తలతో కనిపించాడు.
ఇది బుల్లితెర - ఓటీటీ ఫార్మాట్ కు సూటయ్యే సినిమా. సైకో-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ప్రభుదేవా వేషాలు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్ ని కట్టి పడేస్తాయని చిత్రబృందం ఆశిస్తోంది. అమైరా దస్తూర్- సంచిత శెట్టి- సాక్షి అగర్వాల్- జనని-గాయత్రి- సోనియా అగర్వాల్-రమ్య నంబీశన్ లాంటి అందగత్తెలు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి గణేశన్ సంగీతం అందించారు. మరోవైపు ప్రభుదేవా తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బిజీగా ఉన్న మల్టీ-టాలెంటెడ్ స్టార్ 2023 లో రెగ్యులర్ చిత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.