డార్లింగ్ మనసు దోచేసిన కేటీఆర్!

Wed Sep 11 2019 10:42:25 GMT+0530 (IST)

Prabhas Shares Minister KTR Twitter Post Over Dengue and Viral Fever

గతంలో ఒక రంగ ప్రముఖుడ్ని మరో రంగ ప్రముఖుడు మెచ్చుకున్నా.. పొగిడేసినా ఎందుకిలా? అన్న క్వశ్చన్ మొదట వచ్చేది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. తమకు నచ్చిన విషయాల్ని పంచుకోవటానికి.. తమ మనసును దోచినోళ్లను పొగిడేయటానికి అస్సలు వెనుకాడటం లేదు. రాజకీయాలు.. రాజకీయ నేతలకు సంబంధించి ఎప్పుడూ.. ఎక్కడా ప్రస్తావించని డార్లింగ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను పొగిడేశారు.ఇంతకూ ప్రభాస్ మనసును మంత్రి కేటీఆర్ ఏ విషయంలో అంతలా దోచేశాడన్నది చూస్తే.. ఇటీవల హైదరాబాద్ లో విషజ్వరాలు విరుచుకుపడటం.. లక్షలాది మంది దీని బారిన నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యం మీద పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటివేళలో మున్సిపల్ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టేయటమే కాదు.. రాష్ట్ర ప్రజలకు దోమల నివారణ అంశంపై ఏమేం చేయాలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలు సలహాలు.. సూచనలు చేశారు.

ఏదో మీడియా ముందు మాట్లాడటం కాకుండా.. స్వయంగా తన ఇంటిని శుభ్రం చేసుకున్నారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్ని శుభ్రంగా ఉంచడటంతో పాటు.. దోమల వ్యాప్తికి అవకాశం ఉన్న మార్గాల్ని మూసేశారు. తాను నివాసం ఉండే ప్రగతి భవన్ లో తానే స్వయంగా ఇంటిని శుభ్రం చేసుకుంటున్న ఫోటోల్ని విడుదల చేశారు.

మంత్రి కేటీఆర్ చేసిన పనికి ఫిదా అయ్యారు డార్లింగ్ ప్రభాస్.  తన ఇంటి పరిసరాల్ని శుభ్రం చేస్తున్న కేటీఆర్ ఫోటోల్ని ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. డెంగ్యూ.. విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలని కోరిన రీల్ సాహో.. అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ తరహా పోస్టులు ప్రభాస్ గతంలో ఎప్పుడూ పెట్టింది లేదు. రోటీన్ కు భిన్నంగా కేటీఆర్ చేసిన పనిని మెచ్చుకున్న ప్రభాస్ ను చూసినంతనే .. ఈ మధ్యన అతగాడు నటించిన సాహోను కేటీఆర్ పొగిడేయటం గుర్తుకు రావటం ఖాయం. సాహో ను మెచ్చుకున్న కేటీఆర్ కు తాజా మెచ్చుకోలుతో బాకీ తీర్చేశారంటారా?