ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న 'రాధేశ్యామ్' టీజర్!

Sun Oct 24 2021 18:00:01 GMT+0530 (IST)

Prabhas Fans Tension Over Radheshyam Teaser

ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో జనవరి 14వ తేదీన విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అభిమానులంతా చాలా రోజులుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బర్త్ డే కానుకగా నిన్న ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తితో ఈ టీజర్ కోసం వెయిట్  చేస్తూ వచ్చిన అభిమానులే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అందుకు కారణం ఈ టీజర్ .. సాధారణమైన ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేకపోవడమే. ఈ టీజర్ చూసిన ఎవరికీ కూడా ఇది మన తెలుగు సినిమా అనిపించదు. ప్రభాస్ చేసిన హాలీవుడ్ సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తున్నారేమోననే అనుభూతి కలుగుతుంది. ప్రభాస్ లుక్ .. ఆయన ఉన్న వాతావరణం ..  కిటికీలో నుంచి కనిపించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అంతా కూడా తెలుగుదనం లోపించే కనిపిస్తాయి. తెలుగు సీజీతో సహా తెలుగుదనం లోపించే కనిపిస్తుంది. ఇది ప్రభాస్ ఇమేజ్ కి పూర్తిభిన్నంగా ఉండే కథలాగుందే అనిపిస్తుంది.

ఈ టీజర్ అంతా కూడా ప్రభాస్ పైనే నడుస్తుంది .. అయితే ప్రభాస్ ఏం చెబుతున్నాడు? దేని గురించి చెబుతున్నాడు? ఆయన పాత్ర స్వరూప స్వభావాలు ఎలాంటివి? అనే విషయాలు మాత్రం సాధారణమైన ప్రేక్షకులకు ఎంతమాత్రం అర్థం కాలేదు. అలా అని చెప్పేసి మిగతా వాళ్లందరికీ పూర్తిగా అర్థమైందని కూడా చెప్పలేం. విజువల్ గా తెరపై అద్భుతాలు ఆవిష్కరించవచ్చు .. కానీ అవన్నీ కథకు లోబడే జరగాలి. గాలిపటం ఆకాశంలోనే ఎగురుతుంది .. కానీ దానిని ఎగరేసినవాడు నేలపైనే ఉంటాడు. గాలిపటానికి .. మనిషికి మధ్య ఉన్న దారం .. ఆధారంగా ఉంటుంది. అలాగే ఏ  కథ అయినా స్థానికతను ఆధారంగా చేసుకునే నడవాలి.

పాన్ ఇండియా సినిమాలు ఇలాగే ఉంటాయి .. అందరినీ దృష్టిలో పెట్టుకునే కథలు తయారవుతాయి అని సర్ది  చెప్పుకోవచ్చు. అదే సమయంలో .. ఇక్కడి ప్రేక్షకులలో ఆ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉంది? తాము చెప్పదల్చుకున్న కథ ఎంతవరకూ వాళ్లకు చేరుతుంది? అనేది దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే అవసరం. కథావస్తువు ఎంత ఖరీదైనదైనా .. బరువైనదైనా .. భారమైనదైనా అది తేలికగా చెప్పినప్పుడే దాని పూర్తి ప్రయోజనం నెరవేరుతుంది. ఇప్పుడు ఈ విషయంలోనే ప్రభాస్ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. పాన్ ఇండియా పేరుతో తమ హీరో తెలుగు నేటివిటీకి దూరంగా వెళ్లకూడదనే కోరుకుంటున్నారు.