Begin typing your search above and press return to search.

డార్లింగ్ ను దెబ్బేసిన ఆ సెంటిమెంట్..

By:  Tupaki Desk   |   31 Aug 2019 4:39 AM GMT
డార్లింగ్ ను దెబ్బేసిన ఆ సెంటిమెంట్..
X
ఒక భారీ సక్సెస్ తర్వాత మరో భారీ సక్సెస్ కోసం తపించటం మామూలే. అందుకు భిన్నంగా టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ కొద్దికాలంగా హల్ చల్ చేస్తోంది. ఒక భారీ సక్సెస్ తర్వాత వెంటనే భారీ పరాజయం పలుకరించటం ఇప్పుడు మామూలుగా మారింది. ఈ సెంటిమెంట్ నుంచి డార్లింగ్ ప్రభాస్ కూడా తప్పించుకోలేకపోయారని చెబుతున్నారు.

ఇదే సెంటిమెంట్ తో ఇప్పటికే అగ్రతారలు పలువురు తెగ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడా జాబితాలో ప్రభాస్ చేరారని చెప్పాలి. బాహుబలి భారీ ఘన విజయం తర్వాత ఏరి.. కోరి నటించిన భారీ యాక్షన్ ఫిలిం సాహో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటమే కాదు.. ప్రభాస్ అండ్ కోకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది.

ఈ చిత్రం కోసం ప్రభాస్ మిత్రులు.. సన్నిహితులు.. బంధువులు భారీగా పెట్టుబడులు పెట్టారన్న విషయం తెలిసిందే. తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా కోసం తాను చాలానే టెన్షన్ పడినట్లుగా ప్రభాస్ చెప్పారు. ఆయన పడిన టెన్షన్ కు తగ్గట్లే ఈ చిత్ర ఫలితం రావటం గమనార్హం.

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించిన తర్వాత అంతకు మించిన డిజాస్టర్ పలుకరించటం మామూలైంది. చాలా తక్కువమందికి తప్పించి.. అగ్రనటులకు ఇదో రివాజుగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంగతే చూస్తే.. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత ఆయన చేసిన సర్దార్ గబ్బర్ సింగ్.. అజ్ఞాతవాసి ఎంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారో తెలిసిందే.

ఇక.. మహేశ్ బాబు విషయంలోనూ ఇలాంటి పరిస్థితే. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన బ్రహ్మోత్సవం.. స్పైడర్ రెండూ భారీగా దెబ్బ పడేలా చేశాయి.. చివరకు భరత్ అనే నేనుతో కాస్త గాడిలో పడ్డారని చెప్పాలి. అంతేనా.. అల్లుఅర్జున్ సంగతే చూస్తే.. దువ్వాడ జగన్నాథం తర్వాత బన్నీ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎంతటి ఫెయిల్యూరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చెర్రీ చేసిన రంగస్థలం ఎంతటా భారీ సక్సెసో తెలిసిందే. ఆ తర్వాత చేసిన వినయ విధేయ రామ ఎలాంటి బ్లాక్ బస్టరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.

యూత్ ఐకాన్ గా మారి.. తన మాట.. చేష్ట ప్రతిదీ క్రేజీగా ఫీలయ్యే అభిమానులున్న విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతడు నటించిన గీతాగోవిందం తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ ఫలితం గురించి తెలిసిందే. ఒక భారీ సక్సెస్ తర్వాత వెనువెంటనే మరో ఘన విజయం చాలా తక్కువమందికి మాత్రమే దక్కింది.

ఒక భారీ సక్సెస్ తర్వాత.. డిజాస్టర్ ఎదురుకావటం ఒక సిండ్రోమ్ గా అభివర్ణించే వారు లేకపోలేదు. ఒక భారీ విజయానికి మించిన మరో ఘన విజయం సాధించాలనే తపనలో.. మరింత ఒత్తిడికి గురైన ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పాలి. బాహుబలి తర్వాత ఒక సాదాసీదా సినిమాను చేసి ఉంటే.. అంచనాలు కంట్రోల్ కావటంతో పాటు.. మీడియా హైప్ కూడా పెద్దగా ఉండేది కాదు. అందుకు భిన్నంగా అదిరిపోయేలా తన మూవీ నెంబర్స్ ఉండాలన్న తపనే అగ్రహీరోలకు శాపంగా మారుతుందన్న మాట కూడా వినిపిస్తోంది.