2024 ఎన్నికలే లక్ష్యంగా పవర్ స్టార్ `లీడర్`

Fri Oct 15 2021 22:00:01 GMT+0530 (IST)

Power Star Leader with the goal of 2024 election

దగ్గుబాటి రానాని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం `లీడర్` క్రిటిక్స్ ప్రశంసలతో విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. సమకాలిన రాజకీయ అంశాల్ని కమ్ములా కల్ట్ జానర్ లో అద్భుతంగా తెరకెక్కించి టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ గొప్ప పేజీని రాసి పెట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల గురించి మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తే... లీడర్ ప్రస్థావన తప్పనిసరి. తాజాగా మరోసారి `లీడర్` టైటిల్ తెరపైకి వచ్చింది. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో `లీడర్` తరహా సినిమా చేయాలని కమ్ములా ప్లాన్ చేస్తున్నట్లు చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.పవన్ వ్యక్తిత్వం..రాజకీయ ప్రసంగాలు..ఆయన లో సేవాభావానికి ఫిదా అయిన శేఖర్ కమ్ముల తదుపరి `లీడర్` కథాంశాన్ని రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చాలా కాలంగా మీడియా లో కథనాలు వేడెక్కిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమికి ప్రధాన కారణం నిజాయితీగా రాజకీయం చేయడమే అన్నది అందరికి తెలిసిన నిజం. ఎన్నికల్లో మద్యం పోయలేదు...డబ్బు పంచలేదు...బలమైన రాజకీయ వ్యక్తులు....శక్తులు లేకుండా పవన్ ఒంటరిగా పోరాటం చేసారు. ఇక 2024 ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు లేకుండా పవన్ సింగిల్ గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ములాకు పవన్ తో ఓ పొలిటికల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అన్న థాట్ పుట్టిందని సమాచారం.

పవన్ తో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేసి ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు రిలీజ్ చేస్తే పవన్ కి కావాల్సిన పొలిటికల్ మైలేజ్ వస్తుందన్నది ప్లాన్ కూడా ఉందట. ఫ్రెష్ గా అప్పుడే సినిమా రిలీజ్ అయితే యువతలో ఓ ఇంపాక్ట్ ఉంటుందనే ఆలోచన కావచ్చు. గత ఎన్నికల్లో ``పవన్ కల్యాణ్ సీఎం సీఎం`` అంటూ గొంతెత్తి అరిచిన వాళ్లే ఓట్లు వేయలేదని ఓ రూమర్ ఉంది. అందుకే పొలిటికల్ మైలేజ్ పెంచేలా సినిమా చేస్తే బావుంటుందని భావిస్తున్నారట. అయితే ఈ ఆలోచనపై పవన్ ఏమంటున్నారు? అంటే.. అసలు ఆయనకు ఇలాంటి ఆలోచన ఉందా అనేది సందేహమే. పవన్ ఇలాంటి సినిమా చేయాలని అభిమానులు కూడా చాలా కాలంగా కోరుకుంటున్నారు. దానికోసం చేయాలని భావించే వీలుంది. సినిమాల ద్వారా ఓటర్లను ఇన్ ప్లూయెన్స్ చేయడం కష్టమని పవన్ గతంలో చాలాసార్లు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ -క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. లీడర్ తరహా కాన్సెప్టులో పవన్ నటిస్తే అది అతడి ఇమేజ్ ని పెంచేదిగా ఉండాలి. దానికోసం కమ్ముల చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది.

భీమ్లా గిఫ్ట కోసం వెయిటింగ్..

మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధం చేయడంలో సక్సెసయ్యారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఈ మూవీలో పవన్ కల్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని పవర్ ఫుల్ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ సరికొత్త రికార్డుల్ని సృష్టించి కరోనా వేళ పవన్ సత్తాని మరోసారి చాటి చెప్పింది. గ్యాప్ వచ్చినా పవన్ మార్కెట్ లో ఎలాంటి మార్పులేదని నిరూపించింది.

ఈ మూవీ ఇచ్చిన జోష్ లో పవర్‌స్టార్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. రానా కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీలో నిత్యామీనన్ పవన్ కు జోడీగా నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందిస్తున్న ఈమూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత పవన్ తనకు `గబ్బర్ సింగ్`తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో `భవదీయుడు భగత్ సింగ్` చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ దసరా లాంచ్ అని అన్నారు. కానీ ఇంకా అప్ డేట్ రాలేదు. నేడు దసరా కానుకగా భీమ్లా నాయక్ నుంచి ఏదైనా గ్లింప్స్ ఉంటుందేమో కాస్త వేచి చూడాలి.