Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలను నిలబెట్టిన 'పోలీస్'..!

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:30 AM GMT
టాలీవుడ్ హీరోలను నిలబెట్టిన పోలీస్..!
X
వెండితెరపై ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్యారక్టర్ అంటే పోలీస్ పాత్ర అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకుని సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు పోలీస్ పాత్రలు పోషించిన సినిమాలు కంబ్యాక్ చిత్రాలుగా ఉపయోగపడ్డాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సైనికుడు' 'అతిథి' 'ఖలేజా' వంటి వరుస పరాజయాల తర్వాత 'దూకుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ గా కనిపించి అలరించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హ్యాట్రిక్ ప్లాప్స్ వచ్చిన తర్వాత వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇది పవన్ కెరీర్ లోనే అప్పటికి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' 'రభస' వంటి డిజాస్టర్స్ తర్వాత 'టెంపర్' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ పోలీస్ గా నటించాడు. ఇప్పుడు రవితేజకు కూడా ఈ పోలీస్ పాత్ర సాలీడ్ హిట్ ఇచ్చింది. 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కోరాజా' వంటి ప్లాప్స్ తర్వాత 'క్రాక్' సినిమాతో హిట్ చవిచూశాడు. ఈ విధంగా పోలీస్ క్యారక్టర్ మన హీరోలను నిలబెట్టిందని చెప్పవచ్చు.