రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు!

Thu Aug 22 2019 13:59:23 GMT+0530 (IST)

Police Book Case Against Raj Tarun Based on his Tweet

కుర్ర హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదం జరగటం.. ఖరీదైన కారు గోడను ఢీ కొట్టిన ఉదంతంలో తొలుత ఈ ప్రమాదానికి పాల్పడింది నటుడు తరుణ్ గా భావించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ లు చానళ్లలో ప్రసారమయ్యాయి. అయితే.. తరుణ్ దాన్ని ఖండించారు. ఇది జరిగిన కొద్దిసేపటికి ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది.ఇందులో యువ హీరో రాజ్ తరుణ్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఈ ప్రమాదానికి రాజ్ తరుణ్ కారణమని తేల్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల్ని పోలీసులు సేకరిస్తుండగా.. బుధవారం ఉదయం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు రాజ్ తరుణ్. తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. రైట్ టర్న్ తీసుకునే సమయంలో కారు అదుపు తప్పి గోడను ఢీ కొన్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాను సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్ల తనకు ఎలాంటి దెబ్బలు తగల్లేవని.. తాను షాక్ కు గురై.. భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసినట్లు పేర్కొన్నారు. తనకు ప్రమాదం జరిగిందని భావించి ఎందరో పరామర్శిస్తున్నారని.. అందరికి థ్యాంక్స్ చెప్పారు రాజ్ తరుణ్. తాను చేసిన నేరాన్ని రాజ్ తరుణ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొనటంతో ఆయనపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు. మరి.. పోలీసుల విచారణలో రాజ్ తరుణ్ ఏం చెబుతారో చూడాలి.