ఒక్క 40 రూపాయలు ఇవ్వండి ప్లీజ్ః హీరోయిన్ రాశీఖన్నా

Thu Jun 17 2021 17:21:22 GMT+0530 (IST)

Please give only 40 rupees

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీసిన దెబ్బ సాధారణమైంది కాదు. దాదాపు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారు. 97 శాతం మంది ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పేద వర్గాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇక కూడూ గూడూ లేనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. వీరికి గతంలో మాదిరిగా కనీసం భోజనం కూడా దొరకట్లేదు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు మానవతా వాదులు ముందుకొస్తున్నారు.అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా కూడా ఉన్నారు. కరోనా వేళ కనీసం తినడానికి తిండి లేని అభాగ్యుల కడుపు నింపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు రాశీ. ఇందుకోసం రోటీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ''BE THE MIRACLE'' పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

అభాగ్యుల ఆకలి తీర్చేందుకు అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు రాశీఖన్నా. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కేవలం రూ.40 ఇవ్వాలని కోరుతున్నారు. ఈ డబ్బులు డొనేట్ చేయడం ద్వారా.. ఏ అండా లేనివారికి ఒక పూట భోజనం పెట్టి ఆకలి తీర్చినవారవుతారంటూ.. మోటివేట్ చేస్తోంది. ఈ క్యాంపెయినింగ్ ఉధృతంగా సాగుతోంది.

రాశీఖన్నా పిలుపు అందుకున్న చాలా మంది డబ్బులు డొనేట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. 40రూపాయలు అనేది పెద్ద అమౌంట్ కాకపోవడం.. అది కూడా అభాగ్యుల ఆకలి తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నం కావడంతో.. తమకు తోచినంత ఇస్తున్నారు. ఈ డబ్బులతో హైదరాబాద్ లో ప్రతి రోజూ దాదాపు 1200 మందికి భోజనం పెడుతున్నారు. రాశీఖన్నా ప్రయత్నాన్ని ఎంతో మంది అభినందిస్తున్నారు.