Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

By:  Tupaki Desk   |   17 March 2023 8:06 PM GMT
మూవీ రివ్యూ : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
X
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' మూవీ రివ్యూ
నటీనటులు: నాగశౌర్య-మాళవిక నాయర్-అవసరాల శ్రీనివాస్-నటాషా దోషి తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా
నిర్మాతలు: విశ్వప్రసాద్-పద్మజ దాసరి
రచన-దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్

నటుడిగానే కాక రచయితగా.. దర్శకుడిగానూ శ్రీనివాస్ అవసరాలది ప్రత్యేకమైన ముద్ర. ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద చిత్రాలతో తన అభిరుచిని చాటుకున్న అతను.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి తీసిన సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. తన తొలి రెండు చిత్రాల హీరో నాగశౌర్యనే లీడ్ రోల్ లో పెట్టి అవసరాల తీసిన ఈ చిత్రం ఆహ్లాదకరమైన ప్రోమోలతో ఆకట్టుకుంది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సంజయ్ (అవసరాల శ్రీనివాస్).. అనుపమ (మాళవిక నాయర్) చదువు కోసం యూకేకు వెళ్లి.. అక్కడ ప్రేమలో పడ్డ జంట. ముందు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. తర్వాత ప్రేమలో పడి సహజీవనం మొదలు పెడతారు. కొంత కాలం వీరి ప్రేమాయణం సాఫీగానే సాగుతుంది. కానీ ఒక ఏడాది సీనియర్ అయిన అనుపమ.. తన ఉద్యోగం కోసం సంజయ్ ను వదిలి వెళ్లడానికి సిద్ధ పడటంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. ఆ దశ నుంచి వీరి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

''ఇది చాలా సహజంగా ఉండే సినిమా. పాత్రలు.. సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ అయితే సహజత్వం పోతుంది. అందుకే తెర మీద వ్యక్తులు నిజంగా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది''.. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా ఎలా ఉండబోతోందో వివరిస్తూ అ చిట్ చాట్లో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన మాటలివి. ఐతే పాత్రల్ని సహజంగా తీర్చిదిద్దొచ్చు.. సంభాషణలు కూడా సహజంగా అనిపించేలా ఉండొచ్చు.. కానీ సినిమా అన్నాక ఎంతో కొంత డ్రామా ఉండాలి. సంఘర్షణ ఉండాలి. అన్నింటికీ మించి పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ అన్నది అత్యంత ఆవశ్యకమైన విషయం. ఇవేవీ లేకుండా ఒక ప్రేమకథను సాధారణంగా పరిచేసి చూడమంటే.. ఎంత అభిరుచి ఉన్న ప్రేక్షకులకైనా నీరసమే వస్తుంది. సహజత్వం పేరు చెప్పి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'తో తన గత రెండు సినిమాలను అమితంగా ఇష్టపడ్డ వారికి కూడా టార్చర్ చూపించేశాడు అవసరాల.

ప్రేమకథల్లో కొత్తగా ఏదో చూపించేయడం అంటే కష్టం. చాలా వరకు లవ్ స్టోరీలు ఒక ఫార్మాట్లో సాగిపోతాయి. అబ్బాయి-అమ్మాయి మధ్య పరిచయం.. ఆ తర్వాత ప్రేమ.. అనుకోకుండా ఒక సంఘర్షణ.. ఆ తర్వాత ఎడబాటు.. చివరికి ఇద్దరూ ఒక్కటైతే కథ సుఖాంతం. ఈ లైన్లోనే వందలు వేల ప్రేమకథలు వచ్చాయి. అవసరాల తొలి చిత్రం 'ఊహలు గుసగుసలాడే' కూడా ఈ లైన్లో నడిచే ప్రేమకథే. కానీ అందులో ప్రధాన పాత్రలు చాలా లవబుల్ గా అనిపిస్తాయి. వాటితో చాలా త్వరగా కనెక్ట్ అవుతాం. ఇద్దరి మధ్య అందమైన మూమెంట్స్ తో ఆహ్లాదం పంచుతాడు అవసరాల. ప్రేమకథలో బ్రేక్ వచ్చాక అవసరాల తన పాత్రనే రంగంలోకి దించి దాంతో కావాల్సినంత వినోదం అందిస్తాడు. ఆ తర్వాత ఎమోషన్ కూడా సరైన పాళ్లలో అందించి కథకు మంచి ముగింపునూ ఇస్తాడు. రెండో సినిమా 'జ్యో అచ్యుతానంద'లో అన్నదమ్ముల కథను కూడా ఇంతే ఎంగేజింగ్ గా మలిచాడు. కానీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'లో పై లక్షణాలు ఏమీ కనిపించవు.

తన కొత్త సినిమాను అవసరాల ఒక ప్రయోగంలా భావించినట్లున్నాడు. నిజ జీవిత వ్యక్తులను తెరపై చూస్తున్నట్లు.. వాళ్లు డైలాగ్స్ చెబుతున్నట్లు కాకుండా మాట్లాడుకుంటున్నట్లు ఉండాలని చాలా బలంగా ఫిక్సయినట్లున్నాడు. తాను అనుకున్న తరహాలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'ని ప్రెజెంట్ చేసే క్రమంలో అవసరాల కథ.. పాత్రలు.. సంభాషణల్లో డ్రామా ఎక్కువ కాకుండా చూసుకుంటే ఓకే. కానీ అసలు డ్రామానే లేకుండా ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నట్లు సినిమా తీయడమే విడ్డూరం. అవసరాల గత సినిమాలను పరిశీలిస్తే.. కొంచెం టిపికల్ గా ఉండేలా పాత్రలు.. డైలాగుల్లో చెణుకులు.. లోతైన ఆలోచనలు కనిపిస్తాయి. కానీ 'ఫలానా..'లో మాత్రం పాత్రల్లో ఏ విశేషం కనిపించదు. సంభాషణల్లోనూ అతడి మార్కు కనిపించదు. ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్ల కాలంలో తమ జీవితాల్లో వివిధ దశల్లో జరిగిన మామూలు విషయాలనే వీడియోలు తీసి పెట్టుకుని.. మనకు వన్ బై వన్ ప్లే చేస్తున్నట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు బీటెక్ లో కలవడం.. ఆపై యూకేకు వెళ్లడం.. ముందు వేర్వేరు చోట్ల ఉండి తర్వాత ఒకే గూటికి చేరడం.. అక్కడ వంటలు చేసుకోవడం.. కలిసి పడుకోవడం.. నిద్ర లేవడం.. కార్లల్లో తిరగడం.. పార్టీలు చేసుకోవడం.. ఇలా ఏ మాత్రం నాటకీయత లేకుండా సన్నివేశాలు మామూలుగా సాగిపోతుంటాయి. ఒక్కో సన్నివేశం ద్వారా అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని విధంగా డాక్యుమెంటరీ నడిచినట్లే సినిమా నడిచిపోతుంటుంది. క్యారెక్టర్లలో ఒక గ్రాఫ్ కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య ఒక బంధం ఏర్పడుతున్న ఫీలింగే ఏ దశలోనూ కలగదు. వాళ్ల మధ్య అసలు ఎడబాటు ఎందుకు వస్తుందో కూడా సరిగా చెప్పలేకపోయాడు అవసరాల. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను చాలా బలహీనంగా.. క్లారిటీ లేనట్లుగా చూపించడంతో విరామ సమయానికే బోలెడంత నీరసం వచ్చేస్తుంది.

ద్వితీయార్ధంలో కథను కొంచెం ముందుకు.. వెనక్కి చూపిస్తూ.. స్క్రీన్ ప్లేలో కొంత వైవిధ్యం తేవడానికి ప్రయత్నం జరిగింది కానీ.. సినిమా పట్ల ఆసక్తి మాత్రం అప్పటికే పూర్తిగా చచ్చిపోతుంది. ఆడియోలో సూపర్ హిట్టయిన 'కనుల చాటు మేఘమా' పాట కోసం వేచి చూసి ఓపిక కూడా నశించి పోతుంది. ఆ పాట వచ్చే సమయానికి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' పడకేసి ఉంటుంది. పాత్రలు వేటికవే ఏదో మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఆ మాటలు సన్నివేశాలకు.. కథకు ఏమైనా ఉపయోగపడుతున్నట్లు మాత్రం అనిపించదు. సింక్ సౌండ్.. డైలాగుల్లో అవసరానికి మించిన సహజత్వం వల్ల ఒక దశ తర్వాత వాటిని అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఆగిపోతుంది. అవసరం లేని సన్నివేశాలు.. డైలాగులతో కాలయాపన చేసిన అవసరాల.. కథలో మలుపుకి కారణమైన.. హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటుకు దారి తీసిన హాస్పిటల్ సన్నివేశాలను కనీసం దృశ్యరూపంలో చూపించకుండా చివర్లో మాటల రూపంలో మమ అనిపించడం అతను ఈ సినిమా విషయంలో ఎంతగా దారి తప్పేశాడో చెప్పడానికి రుజువు. ''కమర్షియల్ సినిమాలు చూసేవారికి రుచించదు''.. ''ఇలాంటి సినిమాలు చూడ్డానికి అభిరుచి.. ఆలోచన ఉండాలి''.. అని కవర్ చేసుకోవడానికిి వీల్లేని సినిమా ఇది. ఎలాంటి ప్రేక్షకుల సహనానికి అయినా పరీక్ష పెట్టేలా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'ని తయారు చేసి పెట్టాడు అవసరాల.

నటీనటులు:

నాగశౌర్య విషయంలో వంకలు పెట్టడానికి లేదు. ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో సాగే సినిమా కోసం అతను రకరకాల అవతారాల్లో కనిపించాడు. అందుకోసం కష్టపడ్డాడు. నటన కూడా పరిణతితో సాగింది. అవసరాల ఆలోచనల్ని అర్థం చేసుకుని నటించాడు. కళ్లతో హావభావాలు పలికించడానికి ప్రయత్నించాడు. మాళవిక నాయర్ కూడా బాగా చేసింది. నాగశౌర్యలా లుక్స్ పరంగా వేరియేషన్ చూపించకపోయినా.. నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. అవసరాల తన కోసం రాసుకున్న పాత్రకు కనీస ఆసక్తిని జోడించలేకపోయాడు. తనలోని నటుడికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. మేఘా చౌదరి గురించి చెప్పడానికేమీ లేదు. హీరో హీరోయిన్లు రూంమేట్లుగా చేసిన అబ్బాయి.. అమ్మాయి ఓకే.

సాంకేతిక వర్గం:

సినిమాలో చెప్పుకోదగ్గ విశేషం అంటే.. కళ్యాణి మాలిక్ పాటలు మాత్రమే. కనుల చాటు మేఘమా.. టైటిల్ సాంగ్ సహా అన్ని పాటలూ ఆహ్లాదభరితంగా ఉన్నాయి. కానీ నేపథ్య సంగీతం మామూలుగానే అనిపిస్తుంది. సన్నివేశాల్లోని నీరసాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ తో పోగొట్టలేకపోయాడు కళ్యాణి. సునీల్ కుమార్ నామా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ లేవు. మనం ఓ సినిమా చూస్తున్నట్లు కాకుండా డాక్యుమెంటరీ ఫీల్ వచ్చేలాగే సినిమాను నిర్మించారు. ఇది దర్శకుడి అభిరుచి మేరకే జరిగినట్లుంది కాబట్టి నిర్మాతల్ని తప్పుబట్టడానికి ఏమీ లేకపోవచ్చు. అవసరాల ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని సినిమా అంతా చూశాక అర్థమవుతుంది. పాత్రలు.. డైలాగులు సహజంగా ఉంటే ప్రేక్షకులు ఎక్కువ రిలేట్ అవుతారని అతను భావించి ఉండొచ్చు. కానీ కనీస స్థాయిలోనూ డ్రామా పండక.. ఎమోషనల్ కనెక్ట్ అన్నదే లేక సినిమా తేడా కొట్టేసింది. సహజత్వం శ్రుతి మించి సినిమా పరమ బోరింగ్ గా తయారవుతున్న విషయాన్ని అతను సహా టీంలో ఎవ్వరూ ఏ దశలోనూ గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

చివరగా: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. సహనాన్ని పరీక్షిస్తారు

రేటింగ్-1.5/5