Begin typing your search above and press return to search.

మహేష్ '#SSMB28' కోసం పవన్ మాట సాయం..?

By:  Tupaki Desk   |   4 May 2021 1:30 PM GMT
మహేష్ #SSMB28 కోసం పవన్ మాట సాయం..?
X
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ వీడియోతోనే '#SSMB28' ప్రాజెక్ట్‌ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో లేదో దీనిపై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చర్చల్లోకి వస్తూనే ఉంది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ '#SSMB28' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'జల్సా' సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ పాత్రని పరిచయం చేస్తూ మహేష్ చెప్పిన మాటల గురించి ఇప్పటికీ సినీ అభిమానులు మాట్లాడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ యాక్షన్ కి.. పవన్ వాయిస్ ని యాడ్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. మహేష్ - త్రివిక్రమ్ - పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈ వార్తలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. పవన్ సినిమా కోసం మహేష్ మాట సాయం చేసినట్లే.. మహేష్ సినిమా కోసం పవన్ మాట సాయం చేస్తారేమో చూడాలి.