Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా...?

By:  Tupaki Desk   |   12 July 2020 2:30 AM GMT
పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించారు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు బ్యాలన్స్ చేయడం కష్టంగా మారుతుందని భావించిన పవన్ కళ్యాణ్ పూర్తి జీవితం ప్రజాసేవకే అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత ఫోకస్ మొత్తం పాలిటిక్స్ పైనే పెట్టాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ చేసిన జనసేన అధినేత 2019 ఎలక్షన్స్ లో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేసారు. అయితే జనసేన ఒక్క సీటు గెలుచుకొని పోటీ చేసిన అన్ని చోట్లా ఓడిపోయింది. దీంతో జనసేన అధినేత ఇప్పుడప్పుడే మళ్ళీ ఎన్నికలు లేకపోవడం.. అందులోనూ పార్టీ కార్యకలాపాల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అవసరమని భావించి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా వరుస సినిమాలను ఓకే చేస్తూ అభిమానులని ఉక్కిరిబిక్కరి చేశారు. అంతే స్పీడ్ గా షూటింగ్స్ కూడా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో మళ్ళీ తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూడలేమని బాధ పడ్డ మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడంతో ఖుషీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ముందుగా 'ఓ మై ఫ్రెండ్' వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. 'పింక్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు పవన్. ఈ సినిమాని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించనున్నారు. రెండు సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు పవన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంత ప్లానింగ్ తో వెళ్తున్న పవన్ కళ్యాణ్ కి కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. 2024 ఎలక్షన్స్ కి ముందు వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని డిసైడైన పవర్ స్టార్ కి అనుకోని ఆటంకం కలిగించింది. అందులోనూ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా షూటింగ్స్ మునుపటిలా సజావుగా సాగేలా కనిపించడం లేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆల్రెడీ కమిట్ అయిన చిత్రాలు పూర్తి చేయడమే పవన్ కళ్యాణ్ కి కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్' వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న క్రిష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఇక హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయాలంటే ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలి. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవడానికి 2023 దాకా సమయం పట్టేలా ఉంది. ఇక ఎలక్షన్స్ కి 6 నెలల ముందు నుండి అయినా సన్నాహకాలు చేసుకుంటాడు.. లేదా అంతకంటే ముందైనా ప్లాన్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే 2024 ఎన్నికల లోపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూడు సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ వచ్చే ఎన్నికల ముందు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.