Begin typing your search above and press return to search.

వంద కోట్లతో పవన్ సెన్సేషనల్ రికార్డ్

By:  Tupaki Desk   |   31 May 2023 2:13 PM GMT
వంద కోట్లతో పవన్ సెన్సేషనల్ రికార్డ్
X
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే అతడు 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో వచ్చాడు. ఈ రెండింటికీ మంచి స్పందన రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో తన రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదని పవర్ స్టార్ నిరూపించుకున్నాడు.

రీఎంట్రీలో చేసిన సినిమాలకు సైతం మంచి కలెక్షన్లు వస్తుండడంతో పవన్ కల్యాణ్ మరింత జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కిస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే నాలుగు క్రేజీ మూవీలను మొదలు పెట్టడంతో పాటు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

ఇలా పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' ఒకటి. సాహోతో తన స్టామినాను నిరూపించుకున్న సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న 'OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే ముంబైలో కొన్ని కీలకమైన షెడ్యూళ్లను పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే కొత్త వాటిని కూడా ప్లాన్ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ చార్జ్ చేస్తున్న రెమ్యూనరేషన్ వివరాలు ఫిలిం నగర్ ఏరియాలో వైరల్‌గా మారాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిన్న మొన్నటి వరకూ ఒక్కో సినిమాకు గరిష్టంగా రూ. 50 - 60 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకునేవాడు. అయితే, 'OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' మూవీకి మాత్రం అతడు ఏకంగా రూ. 100 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా టాలీవుడ్‌లో వంద కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటోన్న చాలా తక్కువ మంది హీరోల జాబితాలో పవన్ చేరిపోయాడు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న 'OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందుతోన్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.