రాజమౌళిని సినిమాలు తీయకుండా చేయాలట

Fri May 27 2022 15:09:51 GMT+0530 (IST)

Pattern Oswalt tweets on Rajamouli

దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఏళ్ల తరబడి ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'ట్రిపుల్ ఆర్'. దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ 1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్రని లిఖించింది. ఉత్తరాదిలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా చేసింది. భారీ వసూళ్లని రాబట్టింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమురం భీంగా ఎన్టీఆర్ ల నటన ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి విదేశీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతం అని ప్రతీ ఒక్కరూ ఈ మూవీని చూడాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు.

తాజాగా అలాంటి ప్రచారాన్నే ఓ హాలీవుడ్ నటుడు చేస్తుండటం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించిన 'ట్రిపుల్ ఆర్' తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. దీంతో తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలకు సంబంధించిన వెర్షన్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మే 20 నుంచి ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో `ట్రిపుల్ ఆర్` స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హాలీవుడ్ నటుడు 'ట్రిపుల్ ఆర్' మూవీపై దర్శకుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హాలీవుడ్ నటుడు పాటన్ ఓస్వాల్ట్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా 'ట్రిపుల్ ఆర్' మూవీపై దర్శకుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా 'ట్రిపుల్ ఆర్'ని వీక్షించిన పాటన్ ఓస్వాల్ట్ 'ట్రిపుల్ ఆర్' చిత్ర బృందం తో పాటు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడాలంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 'ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతమైన చిత్రం. ఈ సినిమా మీ దగ్గర్లోని థియేటర్లలో ఆడకపోతే ఇప్పుడు ఓటీటీల్లోనూ అందుబాటులో వుంది.

తప్పక చూడండి. రాజమౌళి.. మీ ఆలోచన.. సినిమాని తెరకెక్కించిన విధానం.. కథ చెప్పిన తీరు అద్భుతం. మిమ్మల్ని సినిమాలు తీయడానికి అనుమతించకూడదు. మీ తదుపరి సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా'అని పాటన్ ఓస్వాల్ట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తను చేసి ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.