Begin typing your search above and press return to search.

ఒక రోజులో ముంబై రికార్డ్.. పఠాన్ 20000 షోలు

By:  Tupaki Desk   |   26 Jan 2023 1:00 PM GMT
ఒక రోజులో ముంబై రికార్డ్.. పఠాన్ 20000 షోలు
X
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఘ‌న‌మైన ఓపెనింగుల‌తో అద‌ర‌గొట్టింద‌ని స‌మాచారం. య‌ష్ రాజ్ బ్యాన‌ర్ క‌ల‌లుగ‌న్న విజ‌యాన్ని ప‌ఠాన్ రూపంలో కింగ్ ఖాన్ అందించాడ‌న్న క‌థ‌నాలు హోరెత్తుతున్నాయి. ఈ సినిమాకి ఎంచుకున్న అద్భుత క‌థ‌- కథనం- యాక్షన్- భావోద్వేగాలు - ఎంపిక చేసిన భారీ కాన్వాసు.. న‌టీన‌టులు ఇలా ప్ర‌తిదీ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. SRK- దీపికా పదుకొనే - జాన్ అబ్రహం అద్భుత విన్యాసాలు ప్రదర్శనలతో థియేట‌ర్ల‌కు కిక్కిరిసే జ‌నాన్ని లాగుతుండ‌డం విశేషం.

రిప‌బ్లిక్ డే ప‌ఠాన్ డే గా నిలిచింద‌న్న చ‌ర్చా బాలీవుడ్ మీడియాలో సాగుతోంది. ఇక ఈ మూవీలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రను కూడా ఏకగ్రీవంగా ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. తాజా స‌మాచారం మేర‌కు షారుఖ్ ఖాన్ పఠాన్ 20000 కంటే ఎక్కువ షోలు కేవలం ముంబై సర్క్యూట్ లో ఒక రోజులో ప్రదర్శించార‌ని స‌మాచారం.

మహమ్మారి అనంతర హిందీ చిత్రానికి ఇది సిస‌లైన రికార్డ్ అని తెలుస్తోంది. పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ జనవరి 18న రాకింగ్ నోట్ తో ప్రారంభమైంది. రోజురోజుకూ టిక్కెట్ల విక్రయాలు పెరిగాయి. ట్రేడ్ స‌మాచారం మేర‌కు..ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఉందని ట్రైల‌ర్ లాంచ్ త‌ర్వాత నిరూప‌ణ అయ్యింది. చాలా మంది ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్ ల్లో పెరిగిన‌ పిచ్చి డిమాండ్ తో అభిమానుల ఆక‌లిని తీర్చడానికి అద‌న‌పు ప్రదర్శనలను పెంచార‌ని తెలుస్తోంది.

ముంబై సర్క్యూట్ లో పఠాన్ కు రోజుకు 20వేల‌ కంటే ఎక్కువ షోలు వేశార‌ని ట్రేడ్ చెబుతోంది. గతంలో RRR (2022)- బాహుబలి 2 -ది కన్‌క్లూజన్ (2017)- అవ‌తార్ : ది వే ఆఫ్ వాట‌ర్ (2022).. అవెంజ‌ర్స్: ఎండ్ గేమ్ (2019) త‌దిత‌ర భారీ చిత్రాలు కూడా ఇంతే భారీ ప్రదర్శనలతో అల‌రించాయి. కానీ మహమ్మారి తర్వాత ముంబై సర్క్యూట్ లో హిందీ చిత్రానికి ఇది మొదటిది. ఇది మూవీకి ఉన్న‌ హైప్ ను నిరూపిస్తోంది.

పఠాన్ బాక్సాఫీస్ తాజా పరిణామాలను విశ్లేషిస్తే నేటి ఉదయం ఎగ్జిబిటర్లు మొదటి షో తర్వాత సినిమాకు 300 షోలను పెంచినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో ఆడుతోంది. వీటిలో 5500 స్క్రీన్ లు భారతదేశంలో ఉండగా మిగిలిన 2500 స్క్రీన్ లు ఓవర్సీస్ లో ఉన్నాయి. ప్రపంచంలోని 100కి పైగా దేశాల్లో విడుదలైన తొలి భారతీయ చిత్రం కూడా పఠాన్ కావడం విశేషం.

పూణేలోని సీజన్స్ మాల్ లోని సినీపోలిస్ మల్టీప్లెక్స్ పఠాన్ ను ఒక రోజులో 62 షోలను ప్లే చేయ‌డం ఒక‌ రికార్డు అని తెలిసింది. సినీపోలిస్ కు చెందిన థానే మ‌ల్టీప్లెక్స్ ఒక రోజులో 59 షోలను ప్లే చేస్తోంది. కింగ్ ఖాన్ షారూఖ్ తాజా ఫ‌లితంతో తిరిగి పాత జోష్ తో క‌నిపిస్తున్నాడ‌న్న టాక్ ఉంది. ఈ సినిమా తొలి రోజు సుమారు 100 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే అధికారికంగా గ‌ణాంకాలు వెలువ‌డాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.