సీన్ లో పమ్మి సాయి ఉంటే పంచ్ పేలాల్సిందే..!

Thu Sep 23 2021 22:00:01 GMT+0530 (IST)

Pammi Sai is one of the busy comedians in Tollywood

టాలీవుడ్ లో హాస్యనటులకు కొదవలేదు. ఎంతమంది ఉన్నా ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో పమ్మి సాయి ఒకరు. 'అతడు' సినిమాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి.. గత కొన్నేళ్లుగా తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. పాత్ర నిడివి ఎంతనేది పక్కన పెడితే.. ప్రతీ సినిమాలోనూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద సాయి కనిపించగానే.. ఈ సీన్ లో ఏదొక పంచ్ పేలుద్ది అని ఆడియన్స్ అనుకునే స్థాయికి చేరుకున్నారు.ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'టక్ జగదీష్' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. ఇందులో లింగాలు అనే పాత్రలో నటించిన పమ్మి సాయికి మంచి గుర్తింపు వచ్చింది. విలన్ అనుచరుడిగా.. కాస్త నెగెటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ లో సాయి మెప్పించాడు. 'భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి..' అంటూ పమ్మి సాయి హీరో నాని కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో అతని నటన అద్భుతమనే చెప్పాలి. అందుకే ఈ పాత్ర ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్లలో ఒకరైన పమ్మి సాయి అసలు పేరు శ్రీనివాస్ సాయి రామ్. ఎలక్ట్రానిక్స్ లో డిప్లమో చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకునే సాయి.. నటుడిగా మారడం యాదృచ్చికంగానే జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వస్థలమైన భీమవరం ప్రాంతానికి చెందిన పమ్మి సాయి.. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అతడు' సినిమాలో సరదాగా ఓ పాత్రలో నటించారు. సినిమాల్లోకి రావటం యాదృచ్చికంగానే జరిగినా.. ఆ తర్వాత మంచి అవకాశాలు రావడంతో సాయి యాక్టింగ్ ను ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు.

అప్పటి నుంచి త్రివిక్రమ్ ప్రతీ సినిమాలోనూ సాయి కి అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. 'నువ్వే నువ్వే' మినహా అన్ని సినిమాల్లోనూ పమ్మి సాయి ఉన్నాడు. వాటిలో 'జులాయి' 'అత్తారింటికి దారేది' 'అ ఆ' 'అల వైకుంఠపురములో' వంటి చిత్రాలు నటుడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'ఛలో ' 'చల్ మోహనరంగా' 'ఎవరు' 'శతమానం భవతి' 'రణరంగం' 'ఎం.ఎల్.ఏ' 'ఒరేయ్ బుజ్జిగా' 'గాలి సంపత్' 'రెడ్' వంటి ఎన్నో చిత్రాల్లో సాయి ప్రాముఖ్యత గల పాత్రలు పోషించారు. 'టక్ జగదీష్' చిత్రంలో సాయి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆచార్య' 'స్వాతిముత్యం' సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాల్లో పమ్మి సాయి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.