ఆస్కార్ వివాదం... అందరి మనసులో మాట రెహమాన్ నోట

Fri Mar 17 2023 09:56:40 GMT+0530 (India Standard Time)

Oscar controversy... Ar Rahaman on IFF

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల వారు కూడా నాటు నాటుకు ఆస్కార్ దక్కడం పట్ల స్పందిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ తరపున కాకుండా నేరుగా ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకున్న నాటు నాటు ఏకంగా అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడం గొప్ప విషయం.ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సరైన జడ్జ్ మెంట్ లేకపోవడం వల్లే నాటు నాటు వంటి పాటను ఆస్కార్ కు పంపలేదని... రాజమౌళి పట్టుదలతో తమ సినిమాపై మరియు పాటపై నమ్మకంతో ఆస్కార్ నామినేషన్స్ కు ప్రయత్నించాడు. దేశం తరఫున అధికారికంగా వెళ్లిన సినిమాలకు నామినేషన్స్ లో చోటు దక్కలేదు కానీ నేరుగా వెళ్లిన నాటు నాటుకు ఆస్కార్ ఎంట్రీ దక్కడం.. అవార్డు దక్కడంతో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రాజమౌళి పట్టుదలతో నేరుగా ఆస్కార్ ప్రయత్నించాడు.. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కు అలా కూడా వెళ్లవచ్చు అనే విషయం కూడా తెలియదు. కనుక ఎన్నో గొప్ప సినిమాలు.. పాటలు.. టెక్నీషియన్స్ ఆస్కార్ అవార్డు అర్హత ఉన్నా కూడా పొందలేక పోయారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు.. ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సినీ ప్రేమికులు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇండియా నుండి అర్హత ఉన్న సినిమాలు ఆస్కార్ కు వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్ కు వెళ్తాయని నేను ఆశిస్తున్నాను.. వాటికి ఆ అర్హత దక్కడం లేదు. అర్హత లేని సినిమాలు కొన్ని ఆస్కార్ నామినేషన్స్ కు దేశం తరఫున అధికారికంగా వెళ్లాయని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కొన్ని వేల సినిమాలు ప్రతి ఏడాది రూపొందుతూ ఉంటాయి. అందులో కమర్షియల్ గా గొప్ప విజయాలను సొంతం చేసుకోకున్నా కూడా అద్భుతమైన సినిమాలుగా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉంటున్నాయి. వాటిని సరిగ్గా జడ్జ్ చేయడంలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ విఫలం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక నుంచి నాటు నాటు అనుభవంతో దేశం తరఫున ఎంట్రీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.