బ్యాచిలర్ డైరెక్టర్ ను వెంటాడుతున్న 'ఆరెంజ్' ఫలితం..!

Fri Sep 24 2021 12:10:19 GMT+0530 (IST)

Orange result chasing bachelor director

బొమ్మరిల్లు' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన భాస్కర్.. వెంటనే 'పరుగు' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే రామ్ చరణ్ తో చేసిన 'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ అవడంతో అతని కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. అఖిల్ అక్కినేని హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న 'బొమ్మరిల్లు' భాస్కర్ ను 'ఆరెంజ్' ప్లాప్ కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.'ఆరెంజ్' సినిమాని నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు.. ఆ సినిమా పరాజయం అవడంతో బాగా నష్టపోయాయని అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఆర్థికంగా నష్టం రావడంతో ఒకానొక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని.. అయితే సోదరులు చిరంజీవి - పవన్ కళ్యాణ్ తనకి సపోర్ట్ గా నిలిచి తనని కాపాడారని గతంలో నాగబాబు తెలిపారు. అయితే ఇప్పుడు ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' మూవీ ప్రమోషన్స్ లో భాస్కర్ ని ఇదే అంశం గురించి ప్రశ్నిస్తున్నారు. దీనికి దర్శకుడు సమాధానం చెబుతూ.. జనరల్ గా ఫెయిల్యూర్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు అని అన్నారు. నాగబాబు తో తన ర్యాపో ఇంకా అలానే ఉందని.. ఆయన చాలా నైస్ పర్సన్ అని తెలిపారు.

''ఆరెంజ్ చెత్త సినిమా అని నేను అనుకోను. చాలా కష్టపడి చేసాను. నా కెరీర్ లో ఆ సినిమాకు పెట్టినంత ఎఫర్ట్ మరే సినిమాకు పెట్టలేదు. ఇలా తీయాలి.. ఇలా రాయాలి.. మ్యూజిక్ - విజువల్స్ - కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి అని ప్రతీ చిన్న విషయంలో ప్రాణం పెట్టి చేసిన సినిమా. అది ఆడలేదనేది తర్వాత సంగతి. కానీ ఇప్పటికీ చాలా ముంది ఆ సినిమాలోని అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని.. చాలా ఎర్లీగా వచ్చేసిందని చాలా మంది అంటుంటారు. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది'' అని భాస్కర్ అన్నారు.

ఏది జరిగినా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలని.. సినిమా చేసిన తర్వాత అది హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెట్టాలని.. దాని తర్వాత పరిణామాలు ఫేస్ చేసి ఎలా గెలిచారనేది ముఖ్యమని బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇప్పటికి తనకు చాలా సపోర్ట్ ఇస్తారని ఆయన అన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతానని బొమ్మరిల్లు భాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.