Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన శర్వా..!

By:  Tupaki Desk   |   9 Aug 2022 12:31 PM GMT
ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన శర్వా..!
X
వర్సటైల్ హీరో శర్వానంద్ నటిస్తున్న మైలురాయి 30వ చిత్రం ''ఒకే ఒక జీవితం''. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ బైలింగ్విల్ మూవీతో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాతో టాలీవుడ్ లో తన మొదటి అడుగు వేస్తోంది.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - స్నీక్ పీక్ - టీజర్ మరియు 'అమ్మ' పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుని సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి.. VFX సన్నివేశాలు అద్భుతంగా రావడానికి చిత్ర బృందం కృషి చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేశారు.

'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని సెప్టెంబర్ 9న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియోని వదిలారు. ఇందులో శర్వా గిటార్ ప్లే చేస్తుండగా.. 'ఆది మీ అమ్మ ని చూడాలని ఉందా?' అనే వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.

ఇది శర్వానంద్ ను నిరాశలో ఉన్న సంగీతకారుడిగా చూపిస్తోంది. దేని వలనో అతను తన పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాడని తెలుస్తుంది. ఇక సైంటిస్ట్ అయిన నాజర్ టైమ్ మెషీన్ ను కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తుండటాన్ని మనం చూడొచ్చు.

ఆఖరి విజువల్స్ లో శర్వానంద్ తన స్కూల్ డేస్ లో తన తల్లితో ఫోటో దిగడం.. అమ్మ పాట బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సన్నివేశానికి ఎమోషనల్ టచ్ ఇవ్వడం కనిపిస్తోంది. ఇందులో శర్వా సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. అతని తల్లి పాత్రను అక్కినేని అమల పోషించారు. వెన్నెల కిషోర్ - ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో డైలాగ్స్ రాయగా.. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఎన్ సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'ఒకే ఒక జీవితం' తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కగా.. తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కాబోతోంది. నిజానికి ఈపాటికే ఈ మూవీ రిలీజ్ కావల్సింది. పాండమిక్ నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చి.. ఎట్టకేలకు వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.