అఫీషియల్ : సంక్రాంతి సమరానికి యంగ్ హీరో రెడీ!

Fri Dec 09 2022 15:56:12 GMT+0530 (India Standard Time)

Official: Young hero ready for Sankranthi!

సంక్రాంతి రేసు రసవత్తరంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు సీరియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' చిత్రాలతో పోటా పోటీగా పోటీకి సైరన్ మోగించేశారు. ఈ ఇద్దరు హీరోల్లో నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' జనవరి 12న విడుదల కాబోతుండగా చిరు నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ సంక్రాతి సమరానికి సై అంటున్న విషయం తెలిసిందే.దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న 'వారసుడు' సంక్రాంతికే తమిళ తెలుగు భాషల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఈ మూవీ రిలీజ్ కోసం భారీ స్థాయిలో థియేటర్లని బ్లాక్ చేసి పెట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ మూవీతో పాటు తల అజిత్ హీరోగా బోనీ కపూర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'తునీవు' తెలుగులో రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీకి 'తెగింపు' అనే టైటిల్ ని అనుకుంటున్నారట.

ఇప్పటికి సంక్రాంతి సమరానికి రెండు స్ట్రెయిట్ సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాలు రావడం ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఈ భారీ సినిమాలతో పోటీపడేందుకు చిన్న హీరో సంతోష్ శోభన్ కూడా ఢీ అంటే ఢీ అంటూ పోటీకి సై అంటున్నాడు. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్యాణం కమనీయం'. ఈ మూవీతో కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.

యువీ క్రియేషన్స్ కి సంబంధించిన యువీ కనెక్ట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం టైటిల్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర బృందం ఇదే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేసింది. పోస్టర్ లో హీరో హీరోయిన్ సోఫాలో ఒకరి కాలి వేళ్లు మరొకరు పట్టుకుని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

ప్లెజెంట్ విజువల్స్ తో సాగే అందమైన కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టైటిల్ మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. యువ ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న యువీ కనెక్ట్స్ ఈ పండక్కి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని అందించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సత్య.జి ఎడిటింగ్ ప్రొడక్షన్ డిజైనర్ గా రవీందర్ రచనా దర్శకత్వం అజయ్ కుమార్ ఆళ్ల.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.