Begin typing your search above and press return to search.

స్టేజ్ పై వికటించిన పంచ్ .. ఫీలైన శ్రీముఖి

By:  Tupaki Desk   |   22 Feb 2021 9:40 AM GMT
స్టేజ్ పై వికటించిన పంచ్ .. ఫీలైన శ్రీముఖి
X
నితిన్ - ప్రియా ప్రకాశ్ వారియర్ కాంబినేషన్లో చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'చెక్' సినిమా, ఈ నెల 26వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ .. మాదాపూర్ లోని 'ఎన్ కన్వెన్షన్'లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించింది. తెల్లని డ్రెస్ లో భూలోక విహారానికి వచ్చిన దేవకన్యలా ఈ స్టేజ్ పై ఆమె సందడి చేసింది. శ్రీముఖి అంటేనే అల్లరి .. అందం .. సంతోషం .. సంబరం. అందువలన ఆమె ఆ సందడితోనే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి తనవంతు ప్రయత్నం చేసింది.

కార్యక్రమం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండటం కోసం డాన్సులు .. కామెడీ స్కిట్లు ఏర్పాటు చేశారు. యూ ట్యూబ్ స్టార్ ఇమ్మాన్యుయేల్ అంటూ అతణ్ణి .. అతని టీమ్ ను శ్రీముఖి పరిచయం చేసింది. అయితే స్టేజ్ పై వాళ్లు చేసిన కామెడీ అంతగా పేలలేదు. ఆ విషయాన్ని అక్కడికి వచ్చిన అభిమానులే చెప్పేశారు. సరైన స్క్రిప్ట్ ను రెడీ చేసుకోలేదనీ, ఆ స్క్రిప్ట్ ను కూడా పెర్ఫెక్ట్ గా ఫాలో కాలేదనే విషయం .. వాళ్లు మైకులు పక్కకి జరిపి అక్కడికక్కడే మాట్లాడుకోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముందస్తుగా స్క్రిప్ట్ ను రెడీ చేసుకోలేకపోవడం వలన, ఆ సమయంలో ఏదో ఒకటి పొరపాటుగా మాట్లాడేయడం జరుగుతూ ఉంటుంది. నిన్న 'చెక్' స్టేజ్ పై కూడా అదే జరిగింది.

ఇమ్మాన్యుయేల్ .. నూకరాజు టీమ్ హడావిడిగా తయారు చేసుకున్న ఒక స్కిట్ కారణంగా శ్రీముఖికి చిరాకు తెప్పించారనే చెప్పాలి. 'చెక్' సినిమా 'చదరంగం' నేపథ్యంలో సాగుతుంది గనుక, చదరంగంలోని రాజులు .. మంత్రులు .. భటులు .. గుర్రాలు ఇలాంటివాటి ప్రస్తావనతో స్కిట్ మొదలుపెట్టారు. గుర్రం ఎల్ షేప్ లో ఎందుకుపరిగెత్తుతుందంటే, ఎల్ అంటే లవ్వనీ .. అందువలన గుర్రం ప్రియా ప్రకాశ్ వైపు పరిగెత్తుతుందని అన్నారు. మరి శ్రీముఖి వైపు గుర్రం ఎందుకు వెళ్లలేదు అనే ఇమ్మాన్యుయేల్ ప్రశ్నకు .. ఆమె ఏనుగులా ఉంటది కాబట్టి అంటూ నూకరాజు పంచ్ వేశాడు. శ్రీముఖికి మాత్రమే కాదు అక్కడున్న వాళ్లకి కూడా ఈ పంచ్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. శ్రీముఖి కూడా బాగానే ఫీలైంది .. కానీ కవర్ చేస్తూ .. మైక్ పక్కకి అనేసి ఆ టీమ్ తో ఏదో అనేసింది. పక్కాగా స్క్రిప్ట్ లేకపోతే పంచ్ లు పేలకపోగా, వికటిస్తాయనడానికి ఇదో ఉదాహరణ.