Begin typing your search above and press return to search.

APలో టికెట్ ధ‌ర‌లేనా బెనిఫిట్ షోల‌కు చెక్

By:  Tupaki Desk   |   21 Sep 2021 5:12 AM GMT
APలో టికెట్ ధ‌ర‌లేనా బెనిఫిట్ షోల‌కు చెక్
X
ఇన్నాళ్లు ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు మాత్ర‌మే స‌మ‌స్యాత్మ‌కం అని భావించిన టాలీవుడ్ కి మ‌రో షాక్ త‌గిలింది. ఇక‌పై పెద్ద సినిమాల‌ రిలీజ్ ముందు బెనిఫిట్ షోల‌కు ఏపీలో అనుమ‌తులు లభించ‌వ‌ని ప్ర‌ముఖ నిర్మాత వెల్ల‌డించ‌డం షాకిస్తోంది.

ఇన్నాళ్లు ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగి వ‌స్తుంద‌ని టాలీవుడ్ ఆశించింది. కానీ తాజా ప‌రిణామం మ‌రింత కాంప్లికేటెడ్ గా మారుతోంద‌ని సంకేతం అందింది. టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వ పోర్ట‌ల్ నిర్వ‌హిస్తుంది. అయితే ధ‌ర‌లు పెంచే వెసులుబాటు గురించి చ‌ర్చిస్తామ‌ని మాత్ర‌మే ఏపీ మంత్రి పేర్ని నాని నిన్న‌టి భేటీలో సినీపెద్ద‌ల‌కు హామీనిచ్చారు. పెంచుకోమ‌ని మాత్రం చెప్ప‌లేదు.

ఇక‌పోతే బెనిఫిట్ షోల‌ను ఇక ప‌ర్మినెంట్ గా ర‌ద్దు చేస్తున్న‌ట్టు కూడా ఈ భేటీలో సినీపెద్ద‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. దానికి ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అనుమ‌తులు లేవు. నిజానికి బెనిఫిట్ షోలు పేరుతో అభిమానులు ప్ర‌జ‌ల నుంచి జేబులు గుల్ల చేస్తున్నార‌ని తీవ్ర ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. పంపిణీ దారులు ఎగ్జిబిట‌ర్లు మాయాజాలం సృష్టిస్తున్నార‌న్న‌ది నేటి మాట కాదు. ద‌శాబ్ధాల పాటు బ్లాక్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను న‌డిపించింది ఎగ్జిబిట‌ర్లు.. డిస్ట్రిబ్యూట‌ర్లే అన్న స‌ర్వే ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. ఇన్నాళ్లు దోచుకున్నార‌న్న ఆవేద‌న ప్ర‌జ‌ల్లో ఉంది. దానిని ప‌రిశీలించిన జగ‌న్ ప్ర‌భుత్వం క‌ఠినంగా ముందుకు వెళుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇక‌పై బెనిఫిట్ షోల పేరుతో అడ్డ‌గోలుగా జేబులు దోచేయ‌డం ఉండ‌ద‌ని ఒక సినీపెద్ద వ్యాఖ్యానించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అభిమానుల లేదా ప్ర‌జ‌ల సినిమా పిచ్చిని ఎన్ క్యాష్ చేసుకోవ‌డం దోచుకోవ‌డం అనేది అనాదిగా కొన‌సాగుతున్న సాంప్ర‌దాయం. దానికి ఇక చెక్ పెట్టేసిన‌ట్టేన‌న్న టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌పై రిలీజ్ ముందు ఏపీలో అర్థ‌రాత్రి షోలు బెనిఫిట్ షోలు అంటూ హంగామాకి ఆస్కారం లేద‌ని ఆయన చెప్పారు.

వ‌కీల్ సాబ్ వ‌ర‌కే కాదు ఇక‌పై బెనిఫిట్ షోలు ఏ పెద్ద సినిమాకి ఉండ‌వ‌ని కూడా తేల్చేశార‌ట‌. టిక్కెట్టు ధ‌ర‌ల గురించి చ‌ర్చించిన ఇదే స‌మావేశంలో బెనిఫిట్ షోల‌పై ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌ద‌ని క్లారిటీ వ‌చ్చేసింద‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ తెలిపారు. బెనిఫిట్ షోలు టికెట్ దోపిడీ ఇత‌ర దోపిడీ విధానాల వ‌ల్ల ప్రభుత్వానికి ప‌న్ను ఆదాయం ఘ‌న‌నీయంగా ప‌డిపోయింది. వాస్త‌వ లెక్క‌ల‌కు నిజానికి పొంత‌న ఉండ‌డం లేద‌ని ప్ర‌భుత్వం పూర్తి క్లారిటీగా ఉంది. అందుకే ఇప్పుడు అన్ని విధాలుగా కొర‌డా ఝ‌ల‌పిస్తోంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

రెండు పెద్ద సినిమాల‌కు 50కోట్ల ప‌న్ను ఎగ‌వేత‌!

ఇకపై బెనిఫిట్ షోల ర‌ద్దు మాత్ర‌మే కాదు.. పెద్ద హీరోలు త‌మ పోస్ట‌ర్ల‌పై 100 కోట్లు.. 200 కోట్లు వ‌సూళ్లు అంటూ లెక్క‌లు చెప్పేందుకు ఆస్కారం లేదు. అలా వేస్తే ప‌న్ను క‌ట్టాల్సిందేన‌ట‌. దీనిపైనా ఏపీ ప్రభుత్వం విశ్లేష‌ణ‌లు చేసింద‌ని స‌మాచారం.

టిక్కెట్టు ధ‌ర‌ల ప్ర‌స్థావ‌న‌తో పాటు ఇంత‌కుముందే మంత్రి పేర్ని నాని ప‌న్ను ఎగ‌వేత గురించి బ‌హిరంగంగా మాట్లాడారు. ఆయ‌న పోస్ట‌ర్ల‌పై లెక్క‌లు మీడియా ముందే అప్ప‌జెప్పారు. టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ఓ రెండు సినిమాల నుంచి ఏకంగా 50కోట్ల ప‌న్ను క‌ట్టాల్సి ఉండ‌గా అదంతా నిర్మాత‌లు ఎగ‌వేసార‌ని ఆయ‌న అన్నారు. తెలుగు నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ప‌న్ను ఎగ్గొడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అల వైకుంఠపురములో- సరిలేరు నీకెవ్వరు లెక్క‌లు చెబుతూ.. అల వైకుంఠపురములో చిత్రానికి రూ.150 కోట్లకు పైగా వసూలు చేస్తే ..సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ.120 కోట్లు తెచ్చింద‌ని ఆ సినిమాల హీరోలే చెప్పిన‌ట్టు మంత్రి వ‌ర్యులు అన్నారు. ఏపీలో 80కోట్ల వ‌సూలు చేసినా కానీ ఆ రెండు సినిమాల‌కు క‌లిపి 50కోట్ల ప‌న్ను వ‌సూల‌వ్వాల‌ని కానీ ఏడాది మొత్తం అన్ని సినిమాల‌కు క‌లిపి 39కోట్ల ప‌న్ను మాత్ర‌మే వ‌సూలైంద‌ని మంత్రి నాని లెక్క‌లు తేల్చారు. టికెట్ రేటు రూ.100 దాటితే జీఎస్టీ 18 శాతం చెల్లించాల‌ని.. 10 లోపు ఉంటే 12 శాతమని వెల్ల‌డించారు. 15శాతం ట్యాక్స్ వ‌సూలైనా కేవ‌లం రెండు చిత్రాల నుంచే భారీ మొత్తం రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ ప‌న్ను మొత్తం ఎగ్గొడుతున్నార‌ని నాని లెక్క తేల్చారు.

ఆస‌క్తిక‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి టాలీవుడ్ ని షిఫ్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఊహించ‌నంత ఆదాయం కోల్పోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద లెక్క‌లు ఉన్నాయి. ప్ర‌తియేటా 2500కోట్లు పైగా ప‌రిశ్ర‌మ నుంచి ఏపీకి ఆదాయం రావాల్సి ఉంటుంది. బ‌డా నిర్మాత‌లంతా ఏపీకి చెందిన వారే అయినా చాలా వ‌ర‌కూ ఆదాయం హైద‌రాబాద్ లోనే ప‌రిశ్ర‌మ ఉండ‌డం వ‌ల్ల అదంతా తెలంగాణ ప్ర‌భుత్వానికి వెళ్లిపోతోంద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు సీరియ‌స్ గా దృష్టి పెట్టింది.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఏపీలో స‌న్నివేశం ఏమంత ఫేవ‌ర్ గా లేద‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. సొంతంగా ప్ర‌భుత్వ‌మే ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను న‌డిపించాల‌నుకోవ‌డం... అలాగే టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ వ‌గైరా అంశాలు నిజంగానే ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. డి.సురేష్ బాబు స‌హా చాలా మంది అగ్ర నిర్మాత‌ల‌కు గిల్డ్ నిర్మాత‌ల‌కు కూడా అస‌లు ఇది మెడ‌కు గుదిబండ‌లా మారిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇన్నాళ్లు రాబ‌ట్టి నంత ఆదాయం ఇక రాబ‌ట్ట‌డం క‌ల్ల అని అంతా న‌మ్ముతున్నారు.