Begin typing your search above and press return to search.

బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో వెనుకబడిపోతున్న నైట్రో స్టార్..?

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:08 AM GMT
బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో వెనుకబడిపోతున్న నైట్రో స్టార్..?
X
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు నైట్రో స్టార్ సుధీర్ బాబు. 'ఏమాయ చేసావే' సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన సుధీర్.. ఆ తర్వాత 'SMS' (శివ మనసులో శృతి) అనే చిత్రంతో హీరోగా మారాడు.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చాడు సుధీర్ బాబు. మాస్ కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా.. విభిన్నమైన కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు.

ఈ క్రమంలో 'ప్రేమ కథా చిత్రమ్' 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' 'భలే మంచి రోజు' 'శమంతకమణి' 'సమ్మోహనం' సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. అయితే 'సమ్మోహనం' తర్వాత సుధీర్ బాబుకు ఆ స్థాయిలో సరైన హిట్ దొరకలేదనే చెప్పాలి.

సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే హీరోలలో సుధీర్ ఒకరు. తన పాత్ర కోసం శక్తినంతా ధార పోసి ఎంత చేయాలో అంత చేస్తుంటాడు. అయితే గత కొంతకాలంగా ఎంతగా కష్టపడుతున్నా.. దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోతున్నాడు.

సుధీర్ నటించిన 'నన్ను దోచుకుందువటే' 'వీరభోగ వసంత రాయలు' 'వి' 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇటీవల వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రం కూడా ఇదే జాబితాలో చేరింది.

సుధీర్ బాబు మరియు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన 'ఆ అమ్మాయి..' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో డైనమిక్ హీరో తదుపరి చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వస్తున్నా.. సుధీర్ బాబుకు ఆఫర్స్ విషయంలో డోకా లేదు. 'భాగీ' యాక్టర్ కు హిందీ మార్కెట్ మరియు డిజిటల్ మార్కెట్ వాల్యూ కారణంగానే క్రమం తప్పకుండా సినిమాలు పొందుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.

సుధీర్ ప్రస్తుతం "హంట్" అనే హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ లో నటిస్తున్నాడు. ఇందులో ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్ మరియు తమిళ హీరో 'ప్రేమిస్తే' భరత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

'గన్స్ డోన్ట్ లై' (తుపాకులు అబద్ధాలు చెప్పవు) అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు బుధవారం 'హంట్' టీజర్ ను మేకర్స్ లాంచ్ చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సుధీర్ బాబు వేట ఎలా సాగుతుందో వేచి చూడాలి.

ఇకపోతే సుధీర్ బాబు తన స్నేహితుడు విజయ్ చిల్లా ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. ఒకవేళ ఇదే జరిగితే 'భలే మంచి రోజు' తర్వాత 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధీర్ చేసే సినిమా ఇదే అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.