Begin typing your search above and press return to search.

'ఆహా'లో విడుదలైన 'నిఫా వైర‌స్‌' మూవీ ఎలా ఉందంటే..!

By:  Tupaki Desk   |   5 Dec 2020 6:23 AM GMT
ఆహాలో విడుదలైన నిఫా వైర‌స్‌ మూవీ ఎలా ఉందంటే..!
X
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటికి కనిపించని ఒక మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ప్రజలు 'కరోనా' అనే పేరు వింటేనే వణికిపోయే పరిస్థితులు వచ్చాయి. మానవాళి మనుగడకు ప్రమాదంగా మారే వైరస్ లో ప్ర‌బ‌ల‌డం ఇదేమీ కొత్త కాదు. గ‌తంలో నిఫా వైర‌స్ లు మనుషులపై దాడి చేశాయి. తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి అయిన నిఫా వైరస్‌ గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా సోకుతుంది. 1998లో మలేషియాలో కనుగొనబడిన నిఫా.. 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చి అనంతరం కేరళలోకి ప్రవేశించి కలకలం రేపింది. కేరళలోని కొన్ని యధార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని నిఫా వైర‌స్ నేప‌థ్యంలో తీసిన మలయాళ సినిమా ''నిఫా వైర‌స్‌''. మాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!

కథ విషయానికొస్తే కేర‌ళ‌లో జ్వ‌రంతో బాధపడుతున్న ఓ యువకుడు హాస్పిటల్ లో చేరి అనూహ్యంగా మ‌ర‌ణిస్తాడు. కేవ‌లం జ్వ‌రంతో అతను చనిపోవడం వైద్యుల్ని విస్మయానికి గురి చేస్తుంది. అదే సమయంలో ఆ రోగికి ట్రీట్మెంట్ చేసిన న‌ర్స్ కూడా అనారోగ్యం పాలవుతుంది. చివరకు వైద్యులు వారికి అరుదైన నిఫా వైర‌స్ సోకిందనే విషయాన్ని గుర్తిస్తారు. ఒకవైపు నిఫా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటం.. మరోవైపు ప్ర‌భుత్వం ఆ వైర‌స్ కి వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డం, నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో నిమగ్నమవడం.. ఇంకోవైపు నిఫా వైరస్ సోకిన రోగుల‌కు సేవ‌లు చేస్తున్న వైద్యుల బాధలు.. ఇలా సాగుతున్న నేపథ్యంలో చివ‌రికి ఈ వైర‌స్ ని ఎలా అరిక‌ట్టారు అన్నదే మిగిలిన క‌థ‌.

ప్రస్తుత విపత్కర పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న 'నిఫా వైర‌స్‌' కథకు అందరూ కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. ఈ మధ్య కరోనా నేపథ్యంలో ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న సన్నివేశాలను చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆసుపత్రిలో నిఫా సోకిన వారిని డాక్ట‌ర్లు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ల సాధ‌క బాధ‌కాలేంటి? అనే విష‌యాల్ని ఇందులో చాలా స‌హ‌జంగా చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత వైద్యులపై కచ్చితంగా మరింత గౌరవ భావం కలుగుతుంది. ఇక ఇందులో నటించిన వారంతా త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సీనియర్ నటి రేవ‌తి త‌ప్ప‌ మిగతా వారంతా తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం లేనివారే. కాకపోతే ఆసక్తికరంగా సాగే క‌థ‌ కావడంతో అందరూ వారిని ఫాలో అయిపోతారు. ఇక ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దీనిపై బాగా స్టడీ చేసినట్లు అర్థం అవుతుంది. కెమెరా పనితనం.. నేప‌థ్య సంగీతం బాగున్నాయి. కాకపోతే తెలుగులో డబ్బింగ్ అక్కడక్కడా మిస్ మ్యాచ్ అయినట్లు అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది అనే అభిప్రాయం కలుగుతుంది. మొత్తం మీద ప్రస్తుత విపత్కర పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న 'నిఫా వైరస్' చిత్రాన్ని ఒకేసారి చూసేయొచ్చు.