వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్న యువహీరో..!

Thu Jun 10 2021 20:00:01 GMT+0530 (IST)

Nikhil to Conduct Vaccination Drive in Villages

ప్రస్తుతం దేశం మొత్తాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు బడా రాజకీయనేతలు సహా అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మాత్రం ఎవరిని వదలడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ మహమ్మారిని ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి. అయితే రోజురోజుకి భారీగా కేసులు.. మరణాలు నమోదు అవుతుండటంతో జనాలు అసలు స్వేచ్ఛగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో చాలామంది పేదలు కరోనా బారినపడి వైద్యానికి ఆర్థికస్థోమత లేక నిరుత్సాహంగా జీవితాలను వదులుకుంటున్నారు. అలాంటి వారికి సహాయం చేసేందుకు కొందరు మాత్రమే ముందుకు వస్తున్నారు.అందులో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలామంది కరోనా బాధితులు ధైర్యం చేసి సోషల్ మీడియా ద్వారా సహకారం అడుగుతున్నారు. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటిలు ముందుకు వచ్చి కరోనా బాధితుల కోసం వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ - తాజాగా నందమూరి బాలయ్య ఇలా ఒక్కొక్కరుగా వాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో యువహీరో నిఖిల్ చేరనున్నాడు. నిజానికి ప్రస్తుతం దేశంలో కరోనా వాక్సిన్స్ కొరత చాలా ఉంది. ఇలాంటి సమయంలో కూడా హెల్ప్ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధమే అంటూ స్పందిస్తున్నాడు.

అయితే ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఎవరైనా వారి సొంత గ్రామాల్లో ఏరియాల్లో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి తాను కూడా తన టీమ్ తో కలిసి త్వరలో వాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేయనున్నట్లు ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపాడు. నిఖిల్ మాట్లాడుతూ.. ఎవరికైనా సెకండ్ డోస్ వాక్సిన్ మిస్ అవుతున్నాం అనుకుంటే.. వారు నాకు ఇంస్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసి చెప్పవచ్చు. ప్రస్తుతం వాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా మనం ఫైట్ చేయవచ్చు. అలాగే మేం కొన్ని రోజుల్లో ప్రతివారం గ్రామాల్లో వాక్సినేషన్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం." అంటూ తెలిపాడు. ప్రస్తుతం నిఖిల్ సేవలు చూస్తూ ప్రశంసిస్తున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా.. నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ-2 18పేజెస్ సినిమాలు చేస్తున్నాడు.