హిందీ స్టార్లు ఈగోకి పోకపోతే మనవాడే టాప్

Sun Aug 14 2022 22:00:01 GMT+0530 (IST)

Nikhil Karthikeya 2 Running Successfully

నార్త్ సినిమా.. సౌత్ సినిమా అనే తారతమ్యం ఇప్పుడు లేదు. మంచి సినిమాకి అంతటా దారులు తెరుచుకున్నాయి. కంటెంట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడ అయినా మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఇప్పుడు కలుగుతోంది. అసలు స్టార్ డమ్ ని కూడా ఆడియెన్ ఖాతారు చేయడం లేదు. సినిమాలో మ్యటర్ ఉంది అన్న టాక్ వస్తే చాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. డిజిటల్-ఓటీటీ యుగంలో ఇది కీలక పరిణామం. ఆసక్తికరంగా ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 లాంటి అగ్ర హీరోల సినిమాలను ఆదరించిన ఉత్తరాది జనం ఇప్పుడు నిఖిల్ లాంటి మిడ్ రేంజ్ ప్రాంతీయ హీరో నటించిన సినిమాని థియేటర్లలో వీక్షించేందుకు ఎగబడుతున్నారంటే మారిన సన్నివేశం అర్థం చేసుకోవాలి.  ఒకవైపు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా.. మరోవైపు ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ చిత్రాలు థియేటర్ల లో ఆడుతుండగానే.. ఇప్పుడు వాటి కంటే బెటర్ పెర్ఫామెన్స్ తో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' ఆడుతోంది. ఇది నిజంగా ఊహించనిది. ఇంతకుముందే హిందీ బెల్ట్ లో తన సినిమాకి థియేటర్లు పెంచండి ప్లీజ్! అంటూ నిఖిల్ ఎంతో కాన్ఫిడెంట్ గా కోరగా ప్రస్తుతం ఆ ఏర్పాట్లు సాగుతున్నాయి. హిందీ ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ఉత్సాహంగా ఆ పనిలో ఉన్నారని సమాచారం. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన నిఖిల్ చిత్రం కార్తికేయ2 కి ఉత్తరాదిన బ్రహ్మరథం పడుతుండడం ఆశ్చర్యకరం.

నిఖిల్ 'కార్తికేయ 2' డే 1 వరల్డ్ వైడ్ బాక్స్-ఆఫీస్ కలెక్షన్స్ ఇంచుమించు  అక్షయ్ నటించిన 'రక్షాబంధన్' వసూళ్లతో సమానంగా వచ్చాయంటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి పలుమార్లు విడుదల తేదీ వాయిదాల తర్వాత 'కార్తికేయ 2' ప్యాక్డ్ హౌస్ హిట్ అన్న టాక్ తో దూసుకెళుతోంది. సానుకూల సమీక్షలు ఈ మూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్ అందుకుంది. కార్తికేయ 2 మేకర్స్‌కి భారీ రిలీఫ్ ఇస్తూ 1వ రోజు బాగా ఆడింది.

పరిమితంగా విడుదలైనప్పటికీ అడ్వెంచర్ థ్రిల్లర్ డే 1లో ఆకట్టుకునే గణాంకాలను నమోదు చేయగలిగింది. ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 5 కోట్లను వసూలు చేసింది. టాక్ ని బట్టి చూస్తుంటే ఈ వీకెండ్ లో భారీ వసూళ్ల దిశగా సాగుతుందని అంచనా. చాలా ప్రాంతాలలో థియేటర్లు పెంచుతున్నారు. కార్తికేయ 2 హిందీలో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఉత్తరాది ప్రాంతాలలో కూడా చాలా థియేటర్లు జోడిస్తున్నారని తెలిసింది. నిఖిల్ పెర్ఫార్మెన్స్ .. చందూ మొండేటి గ్రిప్పింగ్ నేరేషన్..కాల భైరవ అద్భుతమైన BGM సినిమాకు ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి.

కార్తికేయ 2 రెండవ రోజు వసూళ్లు 1వ రోజు కంటే చాలా పెద్దవిగా ఉంటాయని .. 3వ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సెలవు సందర్భంగా ఆ సంఖ్యలు కచ్చితంగా నిర్మాత ముఖంలో చిరునవ్వు తెప్పించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. 2014 బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కథతో వచ్చిన 'కార్తికేయ 2' లో అనుపమ పరమేశ్వరన్- శ్రీనివాస్ రెడ్డి-అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

ఆసక్తికరంగా 'కాశ్మీర్ ఫైల్స్' తర్వాత అనుపమ్ ఖేర్ ఇప్పుడు రెండో బంపర్ హిట్టు కొట్టి హిందీ ఆడియెన్ కి రిలీఫ్ నిచ్చిన నటుడయయారు!!  కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అక్షయ్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' ని ఓడిస్తే.. ఇప్పుడు కార్తికేయ 2 అక్షయ్ నటించిన 'రక్షాబంధన్' ని వెనక్కి నెట్టింది.