ఎక్కడ తప్పు జరుగుతుందో చెక్ చేసుకోండి నాగ్..!

Fri Oct 07 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

News on nagarjuna movies

టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోల్లో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున.. ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ విజయాలను అందుకోవడం లేదు. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్లుగా మిగలకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.'ఆఫీసర్' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నాగ్.. అక్కడి నుంచి మళ్లీ పుంజుకోలేకపోతున్నారనే చెప్పాలి. నాని తో కలిసి చేసిన 'దేవదాస్' మూవీ పర్వాలేదనిపించుకోగా.. 'మన్మథుడు 2' సినిమా రూపంలో మరో ప్లాప్ వచ్చి పడింది.

ఆ తర్వాత వచ్చిన 'వైల్డ్ డాగ్' సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇదే క్రమంలో నాగచైతన్య తో కలిసి చేసిన 'బంగార్రాజు' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి మంచి విజయం సాధించింది.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడం.. తోడుగా తనయుడు కూడా ఉండటం కూడా కలిసి రావడంతో.. తక్కువ టికెట్ రేట్లతో కూడా 'బంగార్రాజు' డీసెంట్ వసూళ్ళు రాబట్టగలిగింది. అంతా బాగానే ఉందని అనుకుంటుండగా.. ఇప్పుడు 'ది ఘోస్ట్' సినిమాతో నాగార్జున కు మళ్లీ నిరాశే ఎదురైంది.

చాలా కాలంగా సరైన సోలో హిట్ కోసం ట్రై చేస్తున్న నాగ్.. దసరా సందర్భంగా ఘోస్ట్ గా వచ్చాడు. టీజర్ - ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించడంతో.. ఈసారి కింగ్ సాలిడ్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అందరూ ఫిక్స్ అయ్యారు.

నాగార్జున సైతం సినిమా మీద నమ్మకంతో రెమ్యునరేషన్ తీసుకోకుండా.. కొన్ని మేజర్ ఏరియాల రైట్స్ తీసుకొని సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఉన్నా సరే.. తన చిత్రంపై ధీమా వ్యక్తం చేశారు.

అయితే నెల ముందే ట్రైలర్ రిలీజ్ చెయ్యడం.. ఆ తర్వాత పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో 'ఘోస్ట్' చిత్రానికి ఆశించిన మేర ప్రీ-రిలీజ్ బజ్ ఏర్పడలేదు. అయినా సరే టాక్ తో సంబంధం లేకుండా ఓ మోస్తరు ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దారుణమైన వసూళ్ళు వచ్చాయి.

మేకర్స్ రెండో రోజు నుంచైనా ఫార్మాలిటీగా అంతో ఇంతో ప్రచారం చేసినా లాంగ్ వీకెండ్ లో మరిన్ని నంబర్స్ రాబట్టడానికి అవకాశం ఉండేది. కానీ ఎందుకనో వారు ప్రమోషన్స్ గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ఏదో మొక్కుబడిగా ఒకటీ అర ట్వీట్లు వేసి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు 'ది ఘోస్ట్' సినిమా వల్ల నష్టాలు రాకపోవచ్చు. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం నాగ్ కు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటి నుంచైనా ఎక్కడ తప్పు జరుగుతోందని పరిస్థితులను బేరీజు వేసుకోవాల్సిన అవసరముంది.

'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' సినిమాలు నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. 'బంగార్రాజు' కూడా ఈ జాబితాలోనే చేరుతుంది. అయితే నాగార్జున మాత్రం తనకు హిట్లు ఇచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ ని వదిలేసి.. రొమాన్స్ - స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఎంచుకుంటున్నాడు.

అయితే ఇప్పుడు 'ది ఘోస్ట్' కు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి.. నాగ్ ఇప్పటికైనా ఆడియన్స్ ఎందుకు అలాంటి సినిమాలను రిసీవ్ చేసుకోలేకపోయారనే కోణంలో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తనను యాక్సెప్ట్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో కాకుండా.. పదే పదే రిజెక్ట్ చేస్తున్నా అదే యాక్షన్ జోనర్ ను ఎందుకు టచ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి రాబోయే సినిమాల్లోనైనా నాగ్ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.