నేటితరం పిచ్చిగా వీక్షణకు అలవాటు పడిన పాశ్చాత్య రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని భాషల్లో దేశంలోని రాష్ట్రాలను చుట్టేసిన సంగతి తెలిసిందే. యువతరం పిచ్చిగా టీవీలకు అతుక్కుపోవడం ఫ్యామిలీ ఆడియెన్ తమను తాము బిగ్ బాస్ ఇంటి సభ్యులుగా ఊహించుకోవడంతో ఈ షోకి తిరుగులేని రేటింగ్ వస్తోంది. అంతగా కనెక్టయ్యే ఎలిమెంట్స్ ఏం ఉన్నాయి? అంటే మనుషుల సత్ప్రవర్తన- దుష్ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇది సరైన వేదిక అని కొందరు విశ్లేషించారు. మనిషిలో నీచం ఎలా ఉంటుందో చూడటానికి కూడా ఇది ఒక వేదిక అని కొందరు చెబుతుంటారు.
ప్రీస్క్రిప్టెడ్ కంటెంట్ కొంత రియాలిటీ కొంత కనిపించే ఈ షోను ఒక్కొక్కరు ఒక్కోలా చదువుకుంటున్నారు. కారణం ఏదైనా ఇందులో బిగ్ బాస్ టాస్క్ ల పేరుతో వింత విచిత్ర పిచ్చి ప్రకోప సన్నివేశాలను చూపించడం బాధాకరం. ఇది మనిషి చావు కంటే విషాదకరమైనదని సాంప్రదాయవాదులు దుయ్యబడుతున్నారు.
ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం లేదా కోతుల్లా కాట్లాడటం.. విచిత్రంగా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ..లేనిపోని జాడ్యం ప్రదర్శించడం వంటి వింతాటలకు ఈ షోలో కొదవేమీ లేదు. ఒకప్పుడు ఆహ్లాదంగా కోతి కమ్మచ్చి.. కోకో.. గూటి బిల్ల ఆడుకున్న పాతతరం లేదా క్రికెట్ కబడ్డీ ఫుట్ బాల్ ఆడుకునే సాంప్రదాయ యువతరానికి ఇలాంటి వింత ఆటలు అర్థం గాక బుర్రలు గోక్కుంటున్న సందర్భమిది.
తాజాగా బిగ్ బాస్-హిందీ 16వ సీజన్ రంజుగా లేదా వెకిలిగా సాగుతోంది. చివరిగా టాప్ 6 పార్టిసిపెంట్స్ తో రన్ అవుతోంది. షోలో గెలవడానికి పోటీదారులు పోరాడుతున్నారు. అయితే ఇందులో ఏం టాస్క్ ఇచ్చారో కానీ ఈ టాస్క్ చూస్తే వింత విచిత్ర ప్రేలాపనలతో ప్రకోపించిన రియాలిటీ షో ఇదని సాంప్రదాయ వాదులు తిట్టుకుంటున్నారు. కట్టేసిన పోటీదారుల ముఖాలపై పసుపు రంగులు జల్లడం తిరిగి వాళ్లపై రకరకాల రంగు నీళ్లు గుమ్మరించడం కారం లేదా అలాంటి రంగు నీళ్లు చల్లడం ఫెవికోల్ లాంటి వి రుద్దడం లాంటి విచిత్ర వేషాలతో పరాకాష్ఠకు చేరుకుంది ఈ షో. ఓవైపు కళ్లలో పసుపు కారం లాంటి ప్రమాదకర లేదా డూప్లికేట్ మిశ్రమాల్ని జల్లడంతో షోని రక్తి కట్టించాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ షోని వీక్షిస్తుంటే కడుపులో తిప్పుతూ వికారం పుడుతోందని సాంప్రదాయ వాదులు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి టాస్క్ లు రాసే దర్శకుడు లేదా రచయితల్లోని పైశాచికత్యం లేదా పాశ్చాత్య ధోరణి ని నిరసిస్తున్నారు. లేదా చేతకాని స్క్రిప్టులు రాసేవాళ్లను ఇదే బిగ్ బాస్ వేదికకు పిలిచి స్టేజీ పైనే సాంప్రదాయ వాదుల ప్యానెల్ ముందు అవమానించాలి! అంటూ ఒక టాలీవుడ్ ప్రముఖుడు సామాజిక వేత్త వ్యాఖ్యానించారు. నిజానికి ఇలా చేస్తే మునుపటి కంటే ఎక్కువ టీఆర్పీ సదరు చానెల్ కి వస్తుందని కూడా సూచిస్తున్నారు. తీరిక సమయాన్ని లేదా తీరిక చేసుకుని టైమ్ వేస్టు చేసుకునేవాళ్ల కోసం డిజైన్ చేసిన బిగ్ బాస్ షోని వీక్షించే వారిని కూడా సైకోపాథిక్ క్యారెక్టర్లకు రుజువుగా అంగీకరించాలని సాంప్రదాయవాదులు దుయ్యబడుతున్నారు.
నేటి పిజ్జా బర్గర్ కుళ్లు కేసీఎఫ్(పేరు మార్చాం) చికెన్లు (కోడికి సూది మందు తినిపించి పెంచే) తినే దయనీయమైన నేటి జనరేషన్ కి జ్ఞానం ఇలాంటి షోలతో వస్తుందా? అని కూడా రోగం లేని పచ్చి ఆహారం తినమని చెప్పే మంతెన సత్యనారాయణ లాంటి వారు తిట్టి పోసే ధైర్యం చేయకపోయినా చాలా సాధా సీదా మనుషులు కూడా ఉతికి ఆరేయకుండా ఉండలేరని తాజా ఎపిసోడ్ నిరూపించింది.
ఆసక్తికరంగా ఈసారి కరణ్ జోహార్ సుంబుల్ తౌకీర్ అనే పార్టిసిపెంట్ ని తొలగించగా..బిగ్ బాస్ 16 తాజా ఎపిసోడ్ చూసేవారు షాక్ అయ్యారట. హౌస్ లో సుంబుల్ నిష్క్రమించిన తర్వాత మండలి కన్నీళ్లు పెట్టుకుంది. అంటే షోలో పిచ్చి వేషాలు వేసేవాళ్ల మధ్య అనుబంధం కూడా ఈ షో చూపించడం ఒక కోణం అనుకుంటే దానితో ప్రేమలో పడే నేటి తరం క్యారెక్టర్లను విశ్లేషించడం కూడా సామాజిక వేత్తలు సాంప్రదాయ వాదులకు సవాల్ గా మారింది. అంతేకాకుండా ఈ పిచ్చి ప్రకోప షో కోసం బాలీవుడ్ వెటరన్ తారలు నీనా గుప్తా .. నటశిక్షణ గురువు అసాధారణ విశ్లేషకుడు.. అపార అనుభవజ్ఞుడు అయిన అనుపమ్ ఖేర్ తమ తదుపరి సినిమా ప్రమోషన్ కోసం ఆశ్రయించడం అవమానకరం!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.