కొత్త తారలు కూడా బిల్డప్ ఇస్తున్నారుగా..

Fri Mar 05 2021 09:00:02 GMT+0530 (IST)

New stars are also giving buildup

కరోనా అందరి లైఫ్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే సినీ తారల్లో ఆ ఛేంజ్ మరీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పాండమిక్ తరువాత తారామణులు మరింత కమర్షియల్ అయిపోయారని తెలుస్తోంది. హీరో డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ రన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి.. క్రేజ్ కరిగిపోయే లోపే అందినంత వెనకేసుకోవడానికి వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ముద్దుగుమ్మలు మొహమాటం లేకుండా పైసా మే పరమాత్మ అనే సూత్రాన్ని తూఛా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఓ వైపు సినిమాల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూనే.. ఇతర మార్గాల ద్వారా రెండు చేతులా సంపాదించాలనే ఆలోచనలతో ఉన్నారు.ఒకప్పుడు సినిమాలకి మాల్స్ ఓపెనింగులకి ఏదైనా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కి మాత్రమే తారామణులు డబ్బులు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు బర్త్ డే విషెస్ చెప్పాలన్నా.. ఎవరికైనా పండుగ శుభాకాంక్షలు చెప్పాలన్నా చేతిలో పైసలు పడాల్సిందే అంటున్నారట. ఈ పద్ధతిని స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి నిన్న మొన్ననే ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మల వరుకు అందరూ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ట్రెండ్ ఇప్పుడు కొందరు చోటా మోటా హీరోలు కూడా అలవాటు చేసుకుంటున్నారట. వీరంతా వాళ్ళకి వాళ్లే ఓ బ్రాండ్ లా బిల్డప్ ఇస్తూ దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత సినీ తారలు బాగా కమర్షియల్ అయిపోయారని అర్థం అవుతోంది.