#హ్యాట్సాఫ్ మెగాస్టార్.. 150 సినిమాల రారాజు 150కోట్లు సేవకే

Fri Jun 04 2021 12:00:55 GMT+0530 (IST)

Netizens Praises Chiranjeevi

150 సినిమాల్లో నటించడమే కాదు 150 కోట్లు ప్రజాసేవ కోసం పంచిన మనసున్న మగ మహారాజు మెగాస్టార్ చిరంజీవి. యాధృచ్ఛికంగానే `మగ మహారాజు` చిత్రంలో నటించిన ఆయన.. నిజ జీవితంలోనూ  దానిని నిరూపించారు. సంపదలన్నీ పనామా - స్విస్ ఖాతాల్లోకి మల్లించే గొప్ప రాజకీయ నాయకులు బడా పారిశ్రామిక వేత్తలు వ్యాపారులు ఉన్న ఈ తెలుగు గడ్డపైనే జన్మించి ఒక నటుడిగా స్వయంకృషితో ఎదిగి ఇంతింతై స్టార్ గా అవతరించి ఇప్పటికి రకరకాల ధాతృ సేవల రూపంలో ఆయన ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారంటే అది నిజంగా తెలుగువారికి గర్వకారణం అనే చెప్పాలి.చిరంజీవి బ్లడ్ బ్యాంకులు చిరంజీవి ఐ బ్యాంకులు ఎందరికో వెలుగులు నింపాయి. ప్రాణాలు పోసాయి. ఇప్పుడు కరోనా కష్ట కాలంలోనూ చిరంజీవి ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లా కోసం ఆయన 50 లక్షలు పైగానే సొంత డబ్బు ఖర్చు చేసి  56 జిల్లాల కోసం ఏకంగా 30కోట్లు పైగానే ధనాన్ని వెచ్చించారని తెలుస్తోంది. కరోనాతో తమవారిని కోల్పోతున్న ఎందరినో చూసి చలించి ఆయన తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి ఇలాంటి సేవకు ఉపక్రమించారు. చరణ్ అడుగడుగునా ఆక్సిజన్ బ్యాంకుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అభిమానులు ఇందులో ఒక భాగం.

మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో అనంతంగా చేస్తున్న లెక్కలేనన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద దాతగా సంచలనాలు సృష్టిస్తున్నారు. మానవతా సాయంలో మగ మహారాజును అని నిరూపిస్తున్నారు. ఇన్నేళ్లలో ఆయన 150 కోట్లు లేదా అంతకుమించి స్వచ్ఛందంగా సేవకోసం ఖర్చు చేశారని అంచనా. ఆయన హృదయం శిఖరం ఎత్తు అని ఇది ప్రూవ్ చేస్తోంది.  

1998 లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును స్థాపించారు. దీనిపై ఇప్పటివరకు సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండొచ్చని అంచనా. 30కోట్లు ఆక్సిజన్ బ్యాంకులకు కేటాయిస్తే ఇతర రూపకాల్లో మరో 40 కోట్లు సులువుగా ఖర్చు చేసి ఉంటారు. కరోనా కష్ట కాలంలో సీసీసీ ప్రారంభించి సినీకార్మికుల్ని అన్నిరకాలా ఆదుకున్నారు. ఆర్టిస్టులు కష్టాల్లో ఉంటే లక్షల్లో డొనేషన్లు ఇస్తున్నారు.

మా అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఆయన సంఘం తరపున విరివిగా ఫించన్లు ఇస్తూ పేద ఆర్టిస్టుల్ని ఆదుకుంటున్నారు. ఆదరణ లేని సీనియర్ ఆర్టిస్టులకు మా మెంబర్ షిప్ లు కల్పిస్తున్నారు. ఇక పరిశ్రమలో అడిగిన వారికి అడగని వారికి జర్నలిస్టులకు కూడా ఆయన విరివిగా భూరి విరాళాలిచ్చారు. చిరంజీవి పేరుతో పుస్తకాలు రాసిన సినీజర్నలిస్టులకు లక్షల్లో డొనేషన్లు ఆర్థిక సాయాలు చేసిన సందర్భాలున్నాయి. వీటిలో చాలా సాయాలు ఇప్పటివరకూ బయటకు తెలియనివి ఉన్నాయి.

ఇక అభిమానుల విషయంలో ఆయన ఎమోషన్ అంతా ఇంతా కాదు. తన అభిమాన సంఘాల సభ్యులకు ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నాను అని ఆదుకున్నారు. నేటి ఈ కష్టకాలంలో ఆయన పెద్దన్న లా నిలిచి సాయపడ్డారు. కరోనా సోకి ఆస్పత్రుల్లో బెడ్స్ ఇవ్వకపోతే.. లేదా ఆర్థికంగా కష్టం ఏర్పడితే నేరుగా ఆస్పత్రి యాజమాన్యాలకు డాక్టర్లకు ఫోన్ లు చేసి వారిని చేర్పించారు. ఆస్పత్రి ఖర్చులు సాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల అన్ని వైపులా ఆయన పహారా స్పష్ఠంగా కనిపించింది. ఇవన్నీ సోషల్ మీడియాల ద్వారా ప్రపంచం తెలుసుకుంది కానీ.. చెప్పుకోదగ్గ టాప్ 10 ప్రముఖ తెలుగు మీడియాల్లో ఎక్కడా కనిపించిందే లేదు.

సాయంలో దానంలో ఆయన చేతికి ఎముక లేదని ఆ సేవలే చెబుతున్నాయి. అయినా ఇదంతా ప్రచారం చేసేందుకు ఒక సెక్షన్ మీడియాకు కుళ్లు. రాజకీయ నాయకులు కానీ లేదా ఇతరులు కానీ చిరంజీవి సేవల్ని గుర్తించి మాట మాత్రానికైనా ప్రస్థావించరు. సోనూ సూద్ వంటి వారు గొప్ప సేవలు చేసిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే టాలీవుడ్ స్టార్లంతా ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కానీ దశాబ్ధాల పాటు మెగాస్టార్ అలుపెరగకుండా తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ సేవలు చేస్తుంటే రాజకీయ ప్రవేశం చేసిన సందర్భంలో బ్లడ్ బ్యాంక్  ఐబ్యాంక్ పైనా ఇతర సేవలపైనా బురద జల్లి వినాశనానికి ఒడికట్టిన వైనం ఇప్పటికీ మెగాభిమానుల్లో చర్చకొస్తూనే ఉంది. అన్నిటినీ తట్టుకుని చిరు నిలబడ్డారు. సేవల్ని కొనసాగిస్తున్నారు. ఇకపైనా ఇవే సేవలు కొనసాగుతాయని ప్రకటించారు.

ఒకరు ఇంతగా సామాజిక సేవ చేస్తే పొగడాలంటే భయం. ఇక్కడ ఎవరి భయాలు వారికుంటాయి. అందుకే కొన్ని జరుగుతుంటాయని ప్రజలంతా గ్రహిస్తున్నారు. నెమ్మదిగా మబ్బు వీడి రియాలిటీని తెలుసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి `కోటి` కెరీర్ ఆరంభంలో అందుకోలేదు. ఒక సినిమాకి కోటి సేవకే కేటాయించారనుకుంటే ఆయన ఇప్పటికే 150సినిమాలకు 150కోట్లు జనాలపైనే పంచేసినట్టు. ప్రస్తుతం బోలా శంకరుడైన మెగాస్టార్ సేవలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. బహుశా ఇదంతా సోషల్ మీడియా మాయాజాలం అని అందరికీ అర్థమవుతోంది.