Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అంటే నాగ్, చిరంజీవియేనా..? ఏంది ఈ కథ..?

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:30 AM GMT
టాలీవుడ్ అంటే నాగ్, చిరంజీవియేనా..? ఏంది ఈ కథ..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం - థియేటర్ల పరిస్థితి గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నియంత్రణ పేరుతో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశం మీద ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ సీఎంతో మాట్లాడటానికి చిరంజీవి పర్సనల్ గా వెళ్లడం.. ఇండస్ట్రీలో ఎవరినీ తీసుకొని పోకుండా ఒక్కరే వెళ్లి కలిసి రావడంపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఇండస్ట్రీలో బాధ్యత గల బిడ్డగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చిరు పేర్కొంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఎవరినీ సంప్రదించకుండా ముఖ్యమంత్రితో ఒంటరిగా భేటీ అవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీకి పెద్దగా తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ - ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. ఇలాంటి వ్యవస్థలు ఉండగా.. వాటితో చర్చించకుండానే ఏపీ సీఎంతో చిరు సమావేశం అవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' బ్లాక్ బస్టర్ మీట్ లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చిరంజీవి కలవడం గురించి ప్రస్తావించారు. సినీ పరిశ్రమపై సీఎం సానుకూలంగా స్పందించారని చిరంజీవి తెలిపినట్లు పేర్కొన్న నాగ్.. జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.

నాగార్జున మాట్లాడుతూ.. ''మొన్న నా మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడాను. 'ఏంటి చిరంజీవి గారూ.. వైఎస్ జగన్ గారిని కలిసొచ్చారు మీరు.. ఏం మాట్లాడుకున్నారు?' అని అడిగా. 'సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని వైయస్ జగన్ గారు చెప్పారు' అని చిరంజీవి తెలిపారు. వైయస్ జగన్ గారికి కూడా థాంక్యూ వెరీ మచ్'' అని అన్నారు. అయితే ఏపీలో టికెట్ ధరల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకముందే సీఎంకు నాగ్ కృతజ్ఞతలు చెప్పడం ఏంటనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేసినా మంచి విషయమే. కాకపోతే దాని కోసం టాలీవుడ్ లోని అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ సర్కారుతో చిరంజీవి వ్యక్తిగతంగా భేటీ అవ్వడం.. సినిమా పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని సీఎం జగన్ చెప్పారని చెప్పడం.. దీనికి సపోర్ట్ గా నాగార్జున మాట్లాడటాన్ని బట్టి చూస్తుంటే.. టాలీవుడ్ అంటే వీళ్ళిద్దరేనా? ఇండస్ట్రీలో పెట్టిన పెట్టుబడులు వీళ్ళవేనా? అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇండస్ట్రీకి అంటే ఆర్గనైజేషన్ మాత్రమే అని.. వ్యక్తులు ఎంత గొప్పరైనా వ్యవస్థల తర్వాతే అని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాహాటంగానే వ్యాఖ్యానించారు. చిరంజీవి గారు తనకున్న పరిచయాలతో జగన్ గారిని కలిసుండొచ్చని.. దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని.. ఇండస్ట్రీ మంచి గురించి మాట్లాడినా అది వారి వ్యక్తిగతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి - నాగార్జున వంటి వారు ఇండస్ట్రీ మేలు కోసం కృషి చేస్తున్నా.. అందరినీ కలుపుకొనిపోతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశం మీద ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు టికెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే దీనిపై పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. మరి త్వరలోనే ఈ వ్యవహారంపై ఏపీ సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.