Begin typing your search above and press return to search.

'బాహుబలి' సిరీస్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన నెట్ ఫ్లిక్స్..!

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:30 PM GMT
బాహుబలి సిరీస్ ను పూర్తిగా పక్కన పెట్టేసిన నెట్ ఫ్లిక్స్..!
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ''బాహుబలి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీని ప్రేరణతో ఓటీటీ దిగ్గజం నెట్ ‏ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‏ తెరకెక్కించాలని నిఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తోంది. 'బాహుబలి' చిత్రానికి ప్రీక్వెల్ గా శివగామి కథ నేపథ్యంలో ''బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్'' పేరుతో ఈ సిరీస్ ని ప్రకటించారు. అయితే విజువల్స్ మరియు అవుట్‌ పుట్ తో సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' సిరీస్ ను తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ లతో పాటుగా పలు ఇతర భాషల్లో తొమ్మిది భాగాలుగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం టాలీవుడ్ దర్శకులు దేవ కట్టా - ప్రవీణ్ సత్తారు కూడా వర్క్ చేశారు. శివగామి పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి ని తీసుకున్నారు. అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సగానికి పైగా సిరీస్ ని పూర్తి చేసిన తర్వాత అవుట్ పుట్ సరిగా లేదని నెట్ ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ ను రీషూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలో బడ్జెట్ ని సవరించి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు సహా టీమ్ మొత్తాన్ని మార్చేసి సిరీస్ ని పునఃప్రారంభించారు. కొత్త దర్శకులుగా కునాల్ దేశ్‌ ముఖ్ మరియు రిభు దాస్‌ గుప్తాలను బోర్డులోకి వచ్చి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసారు. శివగామి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

అయితే దాదాపు 6 నెలల పాటు షూటింగ్ చేసిన తర్వాత అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పూర్తిగా నిలిపివేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకుంది. 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన తర్వాత ఓటీటీ దిగ్గజం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి.