Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ అన్వేషణ కోసం నెట్‌ ఫ్లిక్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..!

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:30 PM GMT
టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ అన్వేషణ కోసం నెట్‌ ఫ్లిక్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..!
X
నెట్‌ ఫ్లిక్స్.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్. ఎప్పటికప్పుడు వీక్షకులకు సరికొత్త కంటెంట్ ను అందించడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఫీచర్ ఫిల్మ్స్ - ఒరిజినల్ సిరీసులు మరియు డాక్యుమెంటరీలను అనేక రకాల జోనర్లలో వివిధ భాషల్లో అందిస్తోంది. ఈ క్రమంలో 190కి పైగా దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి 205 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

ఇండియాలోనూ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత రెండేళ్లలో తెలుగు కంటెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ ఇక్కడి వారికి కూడా బాగా చేరువైంది. బ్లాక్ బస్టర్ సినిమాలు - ఆంథాలజీ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడమే కాకుండా క్రేజీ చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తోంది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ మన దేశంలో ఉన్న యువ ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఓ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది.

న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కొత్త కథకులను అన్వేషించడంలో భాగంగా 'టేక్ టెన్' పేరిట నెట్ ఫ్లిక్స్ ఓ షార్ట్ ఫిల్మ్ పోటీని నిర్వహించనుంది. ఇందులో ఎంపికైన వారు వర్క్ షాప్ కు హాజరవ్వడమే కాకుండా 10వేల డాలర్లతో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించే సదావకాశం దక్కించుకోనున్నారు. దేశంలో పదిమంది ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ ను వెలికితీసే ఈ కార్యక్రమంలో ఫిల్మ్ కంపానియన్ సంస్థ కూడా భాగం అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ నిర్వహించే ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలంటే 'మై ఇండియా' అనే అంశంపై రెండు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను మొబైల్ లో చిత్రీకరించి నెట్ ఫ్లిక్స్ కు పంపాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీకి ఎంపికైన వారు రైటింగ్ - డైరెక్షన్ - ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్ ఫ్లెక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

నెట్ ఫ్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ లో ఈ షార్ట్ ఫిల్మ్ లను అప్లోడ్ చేయనున్నారు. ఇండియాలో ప్రతిభ ఉన్న యువతను వెలికితీసి.. ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఓటీటీ దిగ్గజం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందుకోసం రాబోయే ఐదేళ్లలో ఏడాదికి 100 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేయనుంది. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల కోసమే 'టేక్ టెన్' కు శ్రీకారం చుట్టినట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. మరి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతమంది తమ టాలెంట్ ని చూపిస్తారో చూడాలి.