రజనీ స్పీడ్ కి తగినట్టుగా పరిగెడుతున్న 'బీస్ట్' డైరెక్టర్!

Wed May 18 2022 14:13:16 GMT+0530 (India Standard Time)

Nelson Dilipkumar with rajinikanth movie update

సాధారణంగా ఒక దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోతే ఆ తరువాత లైన్లో ఉన్న ప్రాజెక్టులు వెనక్కి వెళుతుంటాయి. నిర్మాణ సంస్థలు .. హీరోలు సహా అందరూ వెనకడుగు వేస్తారు. కానీ నెల్సన్ దిలీప్ కుమార్ విషయంలో మాత్రం అలా జరగలేదు.విజయ్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'బీస్ట్' ఇటీవలే ప్రేక్షకులను  పలకరించింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో  అంచనాలను అందుకోలేకపోయింది. తమిళనాట ఈ సినిమా వసూళ్లు  ఓకే. కానీ మిగతా చోట్ల ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది.

ఈ సినిమా తరువాత నెల్సన్ దిలీప్ కుమార్  .. రజనీకాంత్ హీరోగా సినిమా చేయవలసి ఉంది. అందుకు ఆయనకి సన్ పిక్చర్స్ వారి నుంచి అడ్వాన్స్ కూడా ముట్టింది. అయితే 'బీస్ట్' దెబ్బకి సన్ పిక్చర్స్ వారు రజనీ ప్రాజెక్టును రద్దు చేసుకున్నారనీ .. రజనీ కూడా అంత సుముఖంగా లేరనే టాక్ వచ్చింది. ఈ సినిమా ఉందనీ .. త్వరలోనే సెట్స్  పైకి  వెళుతున్నామని నెల్సన్ ట్వీట్ చేయడంతో అప్పటివరకూ సాగిన అపోహలకు తెరపడింది. ఇక ఇప్పుడు రజనీ 169వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అని రజనీ అభిమానులంతా వెయిట్  చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే అన్ని పనులను పూర్తి చేస్తూ వెళుతున్నారని సమాచారం.

ఈ సినిమాకి ముందు రజనీ చేసిన 'అన్నాత్తే'  పరాజయం పాలైంది. తెలుగులో 'పెద్దన్న'  పేరుతో విడుదలైన ఈ సినిమాను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక 'బీస్ట్' స్క్రీన్ ప్లే విషయంలో నెల్సన్ విమర్శలను ఎదుర్కొన్నాడు. అందువలన రజనీకి హిట్ ఇవ్వడం ఎంత అవసరమో .. తన వైపు నుంచి ఈ ప్రాజెక్టు పై దృష్టి పెట్టడం ఆయనకి అంతే అవసరం.

'బీస్ట్' సినిమాను అరబిక్ కుతు సాంగ్ జనంలోకి తీసుకుని వెళ్లింది. అంత గొప్పగా ఆ బీట్ ను అనిరుధ్ కంపోజ్ చేశాడు. అలాగే ఆ సినిమాకి  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అందువలన ఈ సారి కూడా అనిరుధ్ నే నెల్సన్ తీసుకున్నాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల  చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక అదే సంక్రాంతికి వంశీ  పైడిపల్లితో విజయ్ చేస్తున్న సినిమా కూడా బరిలోకి దిగనుంది. ఈ రెండు సినిమాలు కూడా రెండు భాషల్లోను భారీ స్థాయిలో విడుదలవుతుండటం విశేషం.