ఎన్టీఆర్ తర్వాత వరుణ్ తో నవీన్ ఫైట్

Wed Feb 26 2020 11:15:35 GMT+0530 (IST)

Naveen Chandra plays the villain again

అందాల రాక్షసి చిత్రంతో నవీన్ చంద్ర నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా కూడా చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం నవీన్ చంద్రకు విలన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రంలో విలన్ గా నటించిన నవీన్ తాజాగా ఒక తమిళ స్టార్ హీరో సినిమాలో కూడా విలన్ గా నటించాడు. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉండగా తాజాగా మరో ఆఫర్ ను నవీన్ దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ ను ఢీ కొట్టబోయేది నవీన్ చంద్ర అంటూ సమాచారం అందుతోంది. బాక్సింగ్ లో ప్రావిణ్యం ఉన్న నవీన్ చంద్ర అయితే విలన్ పాత్రకు బాగా సెట్ అవుతాడని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.

పలువురు యంగ్ స్టార్స్ ను చూసిన తర్వాత చివరకు ఆ పాత్రకు నవీన్ చంద్ర సూట్ అవుతాడని నిర్ణయించారట. ఇటీవల స్క్రీన్ టెస్ట్ చేసినా కూడా అందులో నవీన్ పాస్ అయ్యాడట. త్వరలోనే షూటింగ్ లో నవీన్ జాయిన్ కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకు కాస్త ఆలస్యం అయ్యింది. కనుక షూటింగ్ ను బ్రేక్ లేకుండా చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. జులై 30న సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించబోతుంది.