Begin typing your search above and press return to search.

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. నాని ఏ స్టారో..?

By:  Tupaki Desk   |   30 March 2023 1:09 PM GMT
ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. నాని ఏ స్టారో..?
X
నేచురల్ స్టార్ నాని.. 15 ఏళ్ల కెరీర్ సినిమా వెంట సినిమా హ్యాపీగానే సాగిపోతున్న లైఫ్.. నాని సినిమా అంటే తప్పకుండా చూడాలి అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నేచురల్ నటనతో స్క్రీన్ నేమ్ కూడా నేచురల్ స్టార్ అని వచ్చేలా చేసుకున్నాడు.

సినిమాలు కూడా తన మార్కెట్ కి తగినట్టుగా హిట్లు పడుతున్నాయి. ఒకటి రెండు టార్గెట్ మిస్ అయినా మూడవది మాత్రం సక్సెస్ అయ్యి బూస్టింగ్ ఇస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఈమధ్య కొన్ని సినిమాల్లోని పాత్రలు రొటీన్ అనిపించాయి.

కథ, కథనాలు ఎలా ఉన్నా ఈమధ్య ప్రేక్షకులు సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద దృష్టి పెడుతున్నారు. అందులో నాని ఒకే తరహా పాత్రలు చేస్తూ నిరాశపరిచాడు. ఇక హీరో ఎవరైనా సరే ఎక్కడ దొరుకుతాడా ఆడేసుకుందాం అన్న ట్రోలర్స్ బ్యాచ్ ఎప్పుడూ అలర్ట్ గా ఉంటుంది.

అందుకే నాని కొన్ని సినిమాల గురించి విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి. వీటికి సమాధానం ఇవ్వాలనుకున్న నాని కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నాడు. తను కేవలం ఇలాంటి పాత్రలే చేయగలను అన్న పరిధి దాటి తనలో చూపించడానికి చాలా ఉంది అనేలా ధరణి పాత్రతో వచ్చాడు నాని.

దసరా సినిమాలో ధరణి పాత్రకు 100కి 100 శాతం న్యాయం చేశాడు నాని. తనని కేవలం ఒక సెటిల్డ్ పాత్రలకే పరిమితం చేయొద్దు అని తనకు తానే చాటింపు వేసుకుని చెప్పేలా దసరా సినిమాలో ధరణి పాత్రలో అభినయం చూపించాడు.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అక్కడక్కడ కొద్దిగా గాడి తప్పినా ఫైనల్ గా నాని మాత్రం ధరణిగా తన కొత్త ఎనర్జీ చూపించాడు. తన సహజ నటనతో ఇన్నాళ్లు క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే అలరించిన నాని తనలో మాస్ హీరో కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.

నాని కేవలం ఈ టైప్ సినిమాలే చేయగలడు.. చేస్తాడు అన్న వారికి సమాధానం ఇస్తూ.. నాని దసరా లాంటి సినిమాలు కూడా చేస్తాడు చేయగలడు అనేలా నిరూపించాడు. అయితే దసరా ఎఫెక్ట్ నాని నెక్స్ట్ సినిమాల మీద భారీగా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది. నాని ఫ్యాన్స్ కి ధరణి ఒక మంచి ఫుల్ మీల్స్ ఇచ్చిపడేశాడని చెప్పొచ్చు.