మైసూర్ హోటల్ గదిలో నరేశ్.. పవిత్రా.. చెప్పుతో కొట్టేందుకు వెళ్లిన మూడో భార్య

Sun Jul 03 2022 15:57:26 GMT+0530 (IST)

Naresh And Pavitra Caught At Hotel

గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో సంచలనంగా మారారు సీనియర్ నటీనటులు నరేశ్.. పవిత్రలు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. పవిత్రను నరేశ్ నాలుగో పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు రావటం.. అందులో నిజం లేదని చెప్పటం తెలిసిందే. ఈ ఇద్దరు నటీనటుల వ్యవహారం తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో హీరో.. హీరోయిన్ల తల్లిగా పవిత్ర.. తండ్రిగా నరేశ్ లు నటించటం.. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది.నరేశ్ మూడో భార్య రమ్యతో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తనను మోసం చేసిందని.. తానో చీటర్ అంటూ నరేశ్ విరుచుకుపడుతుంటే.. ప్రస్తుతం మూడో భార్యగా వ్యవహరిస్తున్న రమ్య.. నరేశ్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా.. నరేశ్.. పవిత్రలు మైసూర్ లోని ఒక హోటల్ గదిలో ఉండటం.. వారిని పట్టుకునేందుకు మూడో భార్య రమ్య వెళ్లటంతో హైడ్రామా నెలకొంది.

వీరి విషయం తెలిసిన మైసూర్ పోలీసులు.. హోటల్ వద్దకు వెళ్లి.. వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నరేశ్ మూడో భార్య రమ్య.. నరేశ్.. పవిత్రల మీద చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ కు చెప్పు తగలటం.. ఇదేం పద్దతి? ఆమె ప్రశ్నించటం కనిపించింది. కన్నడ మీడియా ప్రసారం చేసిన వీడియో క్లిప్ లో నరేశ్.. పవిత్రలు హోటల్ గది నుంచి బయటకు రావటం.. వారిపై చెప్పుతో దాడి చేసేందుకు రమ్య ప్రయత్నించటం.. ఆమెను అతి కష్టమ్మీదా పోలీసులు నిలువరించారు. అదే సమయంలో నరేశ్.. పవిత్రలను వారి వ్యక్తిగత సిబ్బందితో లిఫ్టులో బయటకు పంపేయటం ఈ వీడియోలో ఉంది.

తన మూడో భార్య (నరేశ్ తో చట్టబద్ధమైన సంబంధం ఇంకా కలిగి ఉన్నారు) రమ్యను ఉద్దేశించి నరేశ్.. విజిల్స్ వేయటం.. చీటర్ అంటూ వ్యాఖ్యలు చేయటం కనిపించింది. ఇదిలా ఉంటే రమ్య ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అక్రమ సంబంధాల్ని మీరు ప్రోత్సహిస్తారా? అంటూ ఆమె పోలీసులను నిలదీస్తుంటే.. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో తన మూడో భార్యను రెచ్చగొట్టేలా నరేశ్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. సీనియర్ నటీనటులు  నరేశ్.. పవిత్రల వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రచ్చగా మారుతుందనటంలో సందేహం లేదన్న మాట వినిపిస్తోంది.